వెస్టిండీస్‌తో రెండో టెస్టు
అబ్దుల్లా షఫీక్ అజేయ సెంచరీ
వారికన్‌కు ఆరు వికెట్లు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరోసారి తన అనిశ్చిత ఆటతీరును ప్రదర్శించింది. ఒక దశలో మ్యాచ్‌ను శాసించే పటిష్ట స్థితి నుంచి... కాసేపట్లోనే పట్టు కోల్పోయింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 115 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 281/2తో పటిష్ట స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. అబ్దుల్లా షఫీఖ్ (323 బంతుల్లో 160 నాటౌట్; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (147 బంతుల్లో 88; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ ముంగిట అనూహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
ఓవర్‌నైట్ స్కోరు 266/2తో మంగళవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బాబర్ ఆజమ్‌తో కలిసి అబ్దుల్లా షఫీఖ్ మూడో వికెట్‌కు 183 పరుగులు జోడించాడు. ఆ తర్వాత అవైస్ జాఫర్ (1), సల్మాన్ ఆఘా (0), మొహమ్మద్ రిజ్వాన్ (18) విఫలమయ్యారు. ఈ దశలో సాజిద్ ఖాన్ (72 బంతుల్లో 30; 4 ఫోర్లు) కాస్త పోరాడాడు. ఒక ఎండ్‌లో పాతుకుపోయిన అబ్దుల్లా షఫీక్ విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగా... మరో ఎండ్ నుంచి సాజిద్ అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు.
అయితే సీల్స్ ఈ జోడీని విడదీయగా... ఒకే ఓవర్‌లో వారికన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ 114వ ఓవర్ మూడో బంతికి అలీ ఉస్మాన్ (10) అవుట్ కాగా... ఐదో బంతికి ఉబైద్ షా (0), ఆరో బంతికి మొహమ్మద్ అలీ (0) అవుటయ్యారు. దీంతో పాకిస్తాన్ జట్టు ఆలౌటైంది. షఫీఖ్ అజేయంగా నిలిచాడు. కరీబియన్ బౌలర్లలో వారికన్ 16 ఓవర్లలో 112 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. షామార్ జోసెఫ్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేసింది. తొలి టెస్టు గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉంది.


