కోచ్‌గా ఫ్లెమింగ్.. కెప్టెన్‌గా రూట్‌.. అధికారిక ప్రకటన | stephen fleming appointed as england new test team coach | Sakshi
Sakshi News home page

కోచ్‌గా ఫ్లెమింగ్.. కెప్టెన్‌గా రూట్‌.. అధికారిక ప్రకటన

Jul 30 2026 3:35 PM | Updated on Jul 30 2026 3:41 PM

stephen fleming appointed as england new test team coach

source: X

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెస్టు జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను నియమించింది. అదే సమయంలో స్టార్ బ్యాటర్ జో రూట్‌ను మరోసారి టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రకటించింది.

53 ఏళ్ల ఫ్లెమింగ్ ఇప్పటివరకు ఏ జాతీయ జట్టుకూ ప్రధాన కోచ్‌గా పనిచేయలేదు. అయితే 2009లో ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు 17 ఏళ్లుగా ప్రధాన కోచ్‌గా కొనసాగి, ఐదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిళ్లను అందించాడు.

ఇటీవల వరుస పరాజయాలు, మైదానం వెలుపల జరిగిన వివాదాల నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్‌ను తొలగించారు. అయితే ఆయన వైట్‌బాల్ జట్ల కోచ్‌గా కొనసాగనున్నారు.

మరోవైపు, జో రూట్ 2017 నుంచి 2022 వరకు ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ కాలంలో 65 టెస్టులకు నాయకత్వం వహించి, రికార్డు స్థాయిలో 27 విజయాలు అందించాడు.

కొత్త బాధ్యతపై స్పందించిన ఫ్లెమింగ్, "ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కోచింగ్ పదవుల్లో ఇది ఒకటి. ఈ బాధ్యత దక్కడం గౌరవంగా భావిస్తున్నాను" అని అన్నాడు.

పాక్‌ సిరీస్‌కు అందుబాటులో ఉండడు
ఆగస్టు 19 నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు ఫ్లెమింగ్ అందుబాటులో ఉండడు. ఆ సిరీస్‌లో సహాయ కోచ్ మార్కస్ ట్రెస్కోతిక్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

స్వదేశంలో కుటుంబంతో కొంత సమయం గడిపిన అనంతరం ఫ్లెమింగ్ ఇంగ్లండ్‌కు చేరుకుని డిసెంబర్‌లో జరిగే దక్షిణాఫ్రికా టెస్టు పర్యటనకు జట్టును సిద్ధం చేయనున్నాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement