Ajinkya Rahane: ఓటమెరుగని ‘సారథి’.. ధోనీ, కోహ్లి, రోహిత్‌ వల్ల కాలేదు | Ajinkya Rahane Retirement: The Unique Captaincy Record That Eluded Kohli, Dhoni & Rohit | Sakshi
Sakshi News home page

Ajinkya Rahane: ఓటమెరుగని ‘సారథి’.. ధోనీ, కోహ్లి, రోహిత్‌ వల్ల కాలేదు

Jul 30 2026 1:20 PM | Updated on Jul 30 2026 1:34 PM

One Ajinkya Rahane Record That Even Kohli, Dhoni, Rohit Couldnt Match

భార‌త క్రికెట్‌లో ఒక శ‌కం ముగిసింది. సీనియ‌ర్ బ్యాట‌ర్ అజింక్య ర‌హానే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే రహ‌నే త‌న 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కేవ‌లం ఒక ప్లేయ‌ర్‌గా మాత్రమే కాదు కెప్టెన్‌గా కూడా విజ‌య‌వంత‌మ‌య్యాడు.

సహచరులు ప్రేమగా ‘జింక్స్’ అని పిలుచుకునే ఈ స్టార్ బ్యాటర్.. నిజంగానే ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై భార‌త్‌కు ఉన్న‌ ‘జింక్స్’ (దుర‌దృష్టం)కు చెక్‌పెట్టాడు. అతడి సారథ్యంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ(2020-21)ని టీమిండియా సొంతం చేసుకుంది.

ఓట‌మెరుగని సార‌థి
విరాట్ కోహ్లి సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు 2020 ఏడాది ఆఖ‌రిలో బోర్డ‌ర్-గ‌వాస్కర్ ట్రోఫీలో త‌ల‌పడేందుకు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా కేవలం 36 ప‌రుగుల‌కే ఆలౌటై ఘోర ప‌రాభవాన్ని మూట‌క‌ట్టుకుంది. అయితే ఈ ఓట‌మి త‌ర్వాత కెప్టెన్ కోహ్లి  వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చాడు.

ఆ క్లిష్ట సమయంలో జట్టు బాధ్యతలను రహానే భుజానెత్తుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లోని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో జట్టును ముందుండి నడిపించి, 2-1తో భారత్‌కు చారిత్ర‌త్మ‌క‌ విజయాన్ని అందించాడు. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో అత‌డు సాధించిన వీరోచిత సెంచ‌రీ స‌గటు క్రికెట్ అభిమాని ఎప్ప‌టికి మర్చిపోడు. 

అయితే త‌న కెరీర్‌లో ఎక్కువ భాగం లీడర్‌షిప్ గ్రూప్‌లో ఉన్నప్పటికీ.. ఈ ముంబై క్రికెటర్‌కు భార‌త జ‌ట్టు పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఎప్పుడూ లభించలేదు. రెగ్యుల‌ర్ కెప్టెన్‌లు అందుబాటులో లేని చాలా సంద‌ర్భాల్లో జ‌ట్టును ర‌హానే న‌డిపించాడు. 

అయితే కెప్టెన్ల‌గా ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌కు కూడా సాధ్యం కాని ఓ రికార్డును ర‌హానే సాధించాడు. కనీసం 5 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన భారత కెప్టెన్లలో అత్యధిక గెలుపు శాతాన్ని కలిగి ఉన్న రికార్డును ర‌హానే సొంతం చేసుకున్నాడు. అతడి నాయకత్వంలో ఆరు టెస్టులు ఆడిన భారత్‌.. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు.

ఇందులో 4 విజయాలు, 2 డ్రాలు ఉన్నాయి. వన్డేల్లోనూ కెప్టెన్‌గా తన మార్క్‌ను చూపించాడు.  వన్డేల్లో జింబాబ్వేపై మూడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి మూడింట్లోనూ గెలిపించాడు. టీ20ల్లో అతడి సారథ్యంలో భారత్ ఒక విజయం, ఒక ఓటమి నమోదు చేసింది. మొత్తంగా రహానే భారత జట్టును 11 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో నడిపించగా, కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూశాడు.

కెప్టెన్‌గా అజింక్య రహానే ట్రాక్ రికార్డు:
వన్డే (vs జింబాబ్వే): గెలుపు (4 పరుగుల తేడాతో)

వన్డే (vs జింబాబ్వే): గెలుపు (62 పరుగుల తేడాతో)

వన్డే (vs జింబాబ్వే): గెలుపు (83 పరుగుల తేడాతో)

టి20 (vs జింబాబ్వే): గెలుపు (54 పరుగుల తేడాతో)

టి20 (vs జింబాబ్వే): ఓటమి (10 పరుగుల తేడాతో)

టెస్టు (vs ఆస్ట్రేలియా): గెలుపు (8 వికెట్లతో)

టెస్టు (vs అఫ్గానిస్తాన్): గెలుపు (ఇన్నింగ్స్ & 262 పరుగులతో)

టెస్టు (vs ఆస్ట్రేలియా): గెలుపు (8 వికెట్లతో)

టెస్టు (vs ఆస్ట్రేలియా): డ్రా

టెస్టు (vs ఆస్ట్రేలియా): గెలుపు (3 వికెట్లతో)

టెస్టు (vs న్యూజిలాండ్): డ్రా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement