'స్టార్‌ ప్లేయర్స్‌నే భయపెట్టాడు.. అయినా జట్టులో నో ఛాన్స్‌' | Irfan Pathan Slams Aqib Nabi's Exclusion from India's Test Squad vs Sri Lanka 2026 | Sakshi
Sakshi News home page

IND vs SL: 'స్టార్‌ ప్లేయర్స్‌నే భయపెట్టాడు.. అయినా జట్టులో నో ఛాన్స్‌'

Jul 30 2026 12:00 PM | Updated on Jul 30 2026 12:19 PM

 Irfan Pathan slams exclusion of uncapped player from SL vs IND 2026 Tests

శ్రీలంకతో జ‌ర‌గ‌నున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న జ‌మ్మూ కాశ్మీర్ పేస్ సంచ‌ల‌నం ఆకిబ్ న‌బీకి మరోసారి నిరాశే ఎదురైంది. అతడిని జట్టు ఎంపిక కోసం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. 

ఈ జట్టులో నలుగురు స్పెషలిస్ట్ పేసర్లకు సెల‌క్ట‌ర్లు అవ‌కాశం క‌ల్పించినప్ప‌టికి.. గ‌త రంజీ సీజ‌న్‌లో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచిన న‌బీకి మాత్రం చోటు ద‌క్క‌క పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ నేప‌థ్యంలో అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్‌ ఇర్ఫాన్ పఠాన్‌ విమర్శలు గుప్పించాడు.

"ఆకిబ్ నబీని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే తెలియ‌దు. అత‌డి వ‌ద్ద పేస్ త‌క్కువ‌గా ఉండ‌డంతోనే సెల‌క్ట్ చేయ‌లేద‌ని చాలా మంది చెబుతున్నారు. వాస్త‌వానికి పేస్‌తో ప‌నిలేదు, ఒక బౌలర్ స‌రైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడా?  లేదా అన్న‌ది ముఖ్యం. దేశవాళీ క్రికెట్‌లో ఇప్ప‌టికే న‌బీ టాలెంట్‌ను మ‌నం చూశాం. 

రంజీ సీజ‌న్ అసాంతం అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో కూడా అత‌డు కేఎల్ రాహుల్ వంటి సీనియ‌ర్ బ్యాట‌ర్‌ను సైతం ఇబ్బంది పెట్టాడు. కాబ‌ట్టి అతడి ప్రదర్శనకు తగిన గుర్తింపు దక్కాల్సిందే. అతడు మంచి రిథమ్‌లో ఉన్నాడు. అతడిని వీలైనంత త్వరగా జట్టులోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు. 

కాగా రంజీ ట్రోఫీ టైటిల్‌ను జమ్ముకాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. ఫైనల్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడు ఇప్పటివరకు  43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 18.63 సగటుతో 162 వికెట్లు పడగొట్టాడు. అందులో పదిహేను ఫైవ్ వికెట్ల హాల్స్ ఉండడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement