source: BCCI X
భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డపై మెరుపులు మెరిపిస్తున్నాడు. అక్కడి వన్డే కప్‌లో యార్క్‌షైర్ కౌంటీ తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
టోర్నీ తొలి మ్యాచ్‌లో గ్లామోర్గన్‌పై 10 ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇది కుల్దీప్‌కు వన్డే కౌంటీల్లో అరంగేట్రం మ్యాచ్.
అనంతరం రెండో మ్యాచ్‌లో సస్సెక్స్‌పై 6.5 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి మరోసారి రెండు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆతర్వాత వోర్సెస్టర్‌షైర్‌పై మూడోసారి రెండు వికెట్ల ప్రదర్శన (2-34) నమోదు చేసి టూ వికెట్స్ హ్యాట్రిక్ సాధించాడు.
కుల్దీప్ వరుస సక్సెస్‌లతో దూసుకుపోవడంతో అతడి జట్టు యార్క్‌షైర్ కూడా మంచి విజయాలు సాధిస్తుంది. ఇంగ్లండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన కుల్దీప్ యార్క్‌షైర్ బౌలింగ్ విభాగానికి కీలక బలంగా మారాడు.
2027 వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక దృష్ట్యా ఈ ప్రదర్శనలు కుల్దీప్ ఎంతో సానుకూలత కలగజేస్తాయి. కుల్దీప్‌కు ఇటీవలికాలంలో టీమిండియా తరఫున పెద్దగా అవకాశాలు రావడం లేదు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా జింబాబ్వే టీ20 సిరీస్‌లోనూ అవకాశం దక్కలేదు.
దీంతో కుల్దీప్ తనను తాను నిరూపించుకునేందుకు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ బాట పట్టాడు. కుల్దీప్ టీమిండియాలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్ తదితర స్పిన్నర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. వైవిధ్యభరితమైన చైనామన్ శైలి కూడా అతడికి అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు.


