టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే కీలక నిర్ణయం తీసుకున్నాడు. 38 ఏళ్ల రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ముంబై క్రికెటర్ గురువారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కాగా రహానే భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో విదేశీ గడ్డపై అతడి రికార్డు అత్యద్భుతం. ఈ సీనియర్ క్రికెటర్ కెప్టెన్‌గా కూడా తన మార్క్ చూపించాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2-1తో తేడాతో ఓడించి భారత్‌కు ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(2020-21) అందించిన ఘనత అతడిది.
రహానే తన 15 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 8414 పరుగులు చేశాడు. అందులో 5077 రన్స్ టెస్ట్ క్రికెట్‌లో సాధించినవే కావడం గమనార్హం. అతడి పేరిట 12 టెస్టు సెంచరీలు ఉన్నాయి.
"ఈ రోజుతో క్యాప్ నంబర్ 278కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చిన్నతనంలో దొంబివ్లీలో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్ కోసం సర్వస్వాన్ని ధారపోశాను. ప్రతీ రోజు, ప్రతీ ఇన్నింగ్స్, బ్యాటింగ్ చేసే అవకాశం లభించినప్పుడల్లా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనేది నా ఏకైక కలగా ఉండేది. నా కల పదిహేనేళ్ల కిందట నేరవేరింది.
తొలిసారి భారత జెర్సీ ధరించినప్పుడు కలిగిన అనుభూతి ఎప్పటికి మర్చిపోలేను. నేను ఈ ఆటను పూర్తి నిబద్ధతతో, నిజాయితీతో ఆడాను. మన ఉద్దేశం సరైనదైతే, ఈ ఆట మనల్ని ఎల్లప్పుడూ గౌరవిస్తుందని నమ్మాను. నేను ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత క్రికెట్ అంచెలంచెలుగా ఎదిగింది.
గత 20 ఏళ్లలో ఆ ఎదుగుదలలో నేను కూడా ఒక భాగంగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. భారత క్రికెటర్‌గా నా ప్రస్ధానం ముగిసినప్పటికి, నాకిష్టమైన ఈ క్రీడలో మాత్రం కొనసాగుతాను. ఈ అద్భుత ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఎంసీఎ, నా సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులు అందరికి ధన్యవాదాలు" అంటూ తన రిటైర్మెంట్ నోట్‌లో రహానే పేర్కొన్నాడు. కాగా రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి ఐపీఎల్‌లో మాత్రం కొనసాగనున్నాడు.


