మంధాన ఒంటరి పోరాటం.. సూపర్ జెయింట్స్‌ ఉత్కంఠ విజయం | Mandhana lone effort takes Super Giants over the line in tense chase | Sakshi
Sakshi News home page

మంధాన ఒంటరి పోరాటం.. సూపర్ జెయింట్స్‌ ఉత్కంఠ విజయం

Jul 29 2026 2:35 PM | Updated on Jul 29 2026 3:03 PM

Mandhana lone effort takes Super Giants over the line in tense chase

source: X

మహిళల హండ్రెడ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (88 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ఉత్కంఠభరిత విజయాన్నందించింది. సన్‌రైజర్స్ లీడ్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడింది. ఫలితంగా సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

లక్ష్య ఛేదనలో మెగ్ లానింగ్ (24), మంధాన కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన జట్టు 61/1 నుంచి 71/5కు పడిపోవడంతో ఓటమి ముంగిట నిలిచింది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో మంధాన ఒంటరి పోరాటం చేసింది. గ్రేస్ స్క్రివెన్స్‌తో 27 పరుగులు, కేథ్రిన్ బ్రైస్‌తో 48 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయపథంలో నడిపించింది. రెండు సార్లు లభించిన క్యాచ్ అవకాశాలను ప్రత్యర్థి జట్టు చేజార్చుకోవడంతో మంధాన హండ్రెడ్‌ లీగ్‌లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది.

చివరి 25 బంతుల్లో 44 పరుగులు అవసరమైన సమయంలో దూకుడు పెంచిన మంధాన వరుస సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్‌లో అవసరమైన ఎనిమిది పరుగులను రెండు భారీ సిక్సర్లతో పూర్తి చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ నిర్ణీత 100 బంతుల్లో నాలుగు వికెట్లకు 142 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ 35, లిచ్‌ఫీల్డ్ 31, బ్రయోనీ స్మిత్ 26 పరుగులతో రాణించగా, చివర్లో కెప్టెన్ డానియెల్ గిబ్సన్ ఆరు బంతుల్లోనే 18 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్‌ అందించింది.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన మంధాన మాట్లాడుతూ, డ్రాప్ క్యాచ్ రూపంలో కొంత అదృష్టం కలిసి వచ్చినా మ్యాచ్‌ను విజయవంతంగా ముగించగలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇలాంటి విజయాలు జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement