బొల్లారం ఆయుధాల కేసు.. భార్య నిలదీయడంతో నోరు విప్పిన మల్లేష్‌? | Interesting Facts In Bollaram Army Case | Sakshi
Sakshi News home page

బొల్లారం ఆయుధాల కేసు.. భార్య నిలదీయడంతో నోరు విప్పిన మల్లేష్‌?

Sep 13 2026 11:23 AM | Updated on Sep 13 2026 11:37 AM

Interesting Facts In Bollaram Army Case

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ బొల్లారం ఆర్మీ ఏరియాలో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. చోరీ చేసిన సైనిక ఆయుధాలను విక్రయించి డబ్బు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అయితే మల్లేష్‌ వెనుక పెద్ద అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌ ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అయితే, కేసు తీవ్రతను పోలీసులు మల్లేష్‌ భార్య, మామకు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో భర్తను భార్య గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఆయుధాలు చోరీ చేసి ఉంటే తప్పును ఒప్పుకోవాలని ఆమె హెచ్చరించడంతో.. చివరకు మల్లేష్‌ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మరోవైపు.. మల్లేష్‌ మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు చేయగా.. అక్రమ ఆయుధాల సరఫరాదారులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. సోషల్‌ మీడియా, వాట్సాప్‌ ద్వారా దేశీయ ఆయుధ సరఫరాదారులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులకు ఆధారాలు దొరకకుండా కీలక వాట్సాప్‌ చాట్‌లు, ఆడియో, వీడియో కాల్స్‌, ఇతర లాగ్‌లను డిలీట్‌ చేసినట్లు వెల్లడైంది.

దీంతో సైబర్‌ క్రైమ్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణుల సహకారంతో డిలీట్‌ చేసిన డేటాను తిరిగి రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాట్స్‌, మీడియా ఫైల్స్‌, కాల్‌ డేటా వంటి కీలక ఆధారాలు బయటకు వస్తే మల్లేష్‌ ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు? ఆయుధాల కోసం ఎవరితో డీల్‌ చేశాడు? అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ ప్రాంగణం నుంచి ఒక్కడే ఆయుధాలు చోరీ చేయడం సాధ్యమేనా? అనే అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మీలోని ‘ఇంటి దొంగల’ సహకారం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది.

చోరీ చేసిన ఆయుధాలను మల్లేష్‌ ఎవరికి విక్రయించేందుకు ప్రయత్నించాడు? గ్యాంగ్‌స్టర్లకా.. ఇతర నేరస్తులకా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయుధాల కోసం జరిగిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. డిజిటల్‌ పేమెంట్లు, బ్యాంకు ఖాతాలు లేదా హవాలా మార్గాల్లో ఏమైనా డబ్బు చేతులు మారిందా? అన్నదానిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో మల్లేష్‌ అరెస్టుతో ఆగకుండా.. ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇదీ చదవండి: సురేఖకు హైకమాండ్‌ నుంచి పిలుపు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement