సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధాల యాప్‌ల వినియోగంలో దేశంలోని టాప్–5 నగరాల్లో హైదరాబాద్ ఉన్నట్లు తేలింది. డిస్క్రీషన్ డేటింగ్(రహస్య డేటింగ్) పేరిట వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకోవడానికి కెనడాకు చెందిన ఓ యాప్ అడ్డాగా మారింది. తాజాగా ఆ విదేశీ యాప్ సంస్థ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో 5 లక్షల మందికిపైగా యాక్టివ్ యూజర్లు ఉండగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 1.10 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. యూజర్ల సంఖ్య ఆధారంగా దేశంలోనే టాప్–5 నగరాల్లో భాగ్యనగరం ఉందని కంపెనీ పేర్కొంది. ఐటీ కారిడార్లు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల నుంచే 60 శాతం ట్రాఫిక్ తమ యాప్‌నకు వస్తోందని వెల్లడించింది. మొత్తం యూజర్లలో 68 శాతం మంది 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారు ఉంటున్నారట. కొన్ని నివేదికల ప్రకారం..ఈ యాప్ కొత్త సబ్‌స్క్రైబర్లలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది.
యాప్ ఫీచర్లలో గోప్యత
ఇండియా యూజర్ ట్రెండ్స్ అండ్ డేటా ప్రైవసీ నివేదిక ప్రకారం.. ఈ యాప్ అందించే రహస్య ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫొటోలను బ్లర్ చేసుకొనే అవకాశం ఉండటం, క్రెడిట్ కార్డులతో చెల్లింపుల విధానం, బ్యాంక్ స్టేట్‌మెంట్లలో యాప్పేరు కనిపించకుండా బిల్లింగ్ చేయడం వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉండటం వల్ల ఇది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారికి ఆకర్షణీయంగా మారుతోంది.
పోలీసులు, సైబర్‌నిపుణుల హెచ్చరికలు
డేటింగ్ యాప్‌ల కోసం వెంపర్లాడే వారిని సైబర్‌నేరగాళ్లు బెదిరించి దోచుకొనే ప్రమాదం ఉందని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రై మ్ గణాంకాల ప్రకారం డేటింగ్ యాప్‌లకు సంబంధించిన ఫిర్యాదులు మూడేళ్లలో 40% పెరిగాయి. మరోవైపు డిజిటల్ గోప్యతకు 100% గ్యారంటీ ఉండదని, బ్లాక్మెయిల్, ఆర్థిక మోసాల ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల సామాజికంగా, మానసికంగా ఎదురయ్యే పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైవాహిక బంధాలు బలహీనపడ్డాయని డేటింగ్‌యాప్‌లను ఆశ్రయించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని చెబుతున్నారు.


