కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది? | Congress High Command Calls Konda Surekha To Delhi | Sakshi
Sakshi News home page

కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?

Sep 13 2026 7:56 AM | Updated on Sep 13 2026 8:10 AM

Congress High Command Calls Konda Surekha To Delhi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్‌ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్‌ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కీలక బాధ్యత అప్పగిస్తారా?
సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్‌ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు.

రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్‌ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. 

రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్‌ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్‌లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్‌ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇదీ చదవండి: అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement