చైనా శాస్త్రవేత్తలు చేపట్టిన ఓ సముద్ర అన్వేషణ అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అందరూ భూమిపై బంగారం కోసం గనులు తవ్వుతుంటే.. చైనా మాత్రం సముద్ర గర్భంలోకి వెళ్లి ఖనిజ సంపదను వెతుకుతోంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చేపట్టిన అన్వేషణలో అక్కడి సముద్ర అడుగుభాగంలో అత్యంత విలువైన బంగారం, వెండి నిక్షేపాలను గుర్తించినట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని ఖనిజ నమూనాల్లో భూమిపై సాధారణంగా కనిపించే నిక్షేపాల కంటే గణనీయంగా అధిక స్థాయిలో బంగారం, వెండి ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చైనాకు చెందిన త్సింగ్‌హువా విశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తల బృందం ఆగస్టులో 18 రోజుల పాటు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర అన్వేషణ చేపట్టింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (AUV), డీప్-సీ విజువల్ శాంప్లర్ వంటి పరికరాలతో సముద్ర గర్భాన్ని పరిశీలించారు. ఇప్పటికే నిర్వహించిన ప్రాథమిక సర్వేల ఆధారంగా 700 నుంచి 1,500 మీటర్ల లోతులో హైడ్రోథర్మల్ వెంట్స్‌ను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నీటి ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. అత్యంత చురుకైన రసాయనిక, ఉష్ణ ప్రక్రియలు చోటుచేసుకునే ఈ ప్రాంతాల చుట్టూ భారీ ఖనిజ నిర్మాణాలు ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు.
హైడ్రో థర్మల్ వెంట్స్ చుట్టుపక్కల మూడు భారీ శంఖాకార ఖనిజ నిర్మాణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. అక్కడి నుంచి సేకరించిన నమూనాలను నౌకలోని ప్రయోగశాలలో ప్రాథమికంగా పరీక్షించారు. చాల్కోపైరైట్, పైరైట్, స్ఫాలరైట్ వంటి ఆర్థికంగా విలువైన ఖనిజాలతో పాటు భారీ స్థాయిలో బంగారం, వెండి ఉన్నట్లు తేలింది. బంగారం గరిష్ఠ సాంద్రత 15.4 పార్ట్స్ పర్ మిలియన్ (PPM)గా నమోదైంది. అంటే ఒక టన్ను ముడి ఖనిజంలో సుమారు 15.4 గ్రాముల బంగారం ఉన్నట్లు లెక్క. ఇక వెండి సాంద్రత ఏకంగా 1,271 PPMకు చేరింది. అంటే ఒక టన్ను ముడి ఖనిజంలో సుమారు 1.271 కిలోల వెండి ఉన్నట్లు అర్థం. ఈ స్థాయి సాంద్రత కొన్ని నమూనాల్లో భూభాగంలోని సాధారణ ఖనిజ నిక్షేపాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీంతో సముద్ర గర్భంలోని ఈ ప్రాంతాలు భవిష్యత్తులో అత్యంత విలువైన ఖనిజ వనరులుగా మారే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
బంగారంతో పాటు అరుదైన జీవరాశులు
ఈ అన్వేషణ కేవలం ఖనిజ సంపదకే పరిమితం కాలేదు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ జీవించే అరుదైన జీవరాశులను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. హైడ్రోథర్మల్ వెంట్స్ ప్రాంతంలో రొయ్యలు, పీతలు, షెల్‌ఫిష్, ఎక్స్‌ట్రీమోఫైల్స్ వంటి జీవ సమూహాలను పరిశోధకులు ఫొటోలు తీశారు. సాధారణ సముద్ర జీవులకు అనుకూలంగా లేని అధిక ఉష్ణోగ్రతలు, రసాయనిక మార్పులు ఉన్న ప్రాంతాల్లో ఈ జీవులు ఎలా మనుగడ సాగిస్తున్నాయన్నది శాస్త్రవేత్తలకు కీలక పరిశోధనా అంశంగా మారింది. వీటి జన్యు వనరులు భవిష్యత్తులో బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధనలకు ఉపయోగపడే అవకాశాలపైనా ఆసక్తి పెరుగుతోంది.
సముద్ర గర్భమే కొత్త బంగారు గని?
భూమిపై సులభంగా అందుబాటులో ఉన్న ఖనిజ వనరులు తగ్గుతున్న నేపథ్యంలో సముద్ర గర్భంలోని ఖనిజ నిక్షేపాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. తాజాగా చైనా గుర్తించిన ఈ నిక్షేపాల్లో బంగారం, వెండి అధిక సాంద్రతలో ఉండటం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. అయితే సముద్ర గర్భం నుంచి ఖనిజాలను వెలికితీయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. అత్యంత లోతైన ప్రాంతాల్లో పనిచేసే సాంకేతికత, భారీ వ్యయం, పర్యావరణ ప్రభావాలు వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రో థర్మల్ వెంట్స్ చుట్టూ ఉన్న ప్రత్యేక జీవ వ్యవస్థకు మైనింగ్ వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందన్నది కీలక ప్రశ్న.
అయినా.. సముద్రం అడుగున దాగి ఉన్న బంగారం, వెండి ప్రపంచ మైనింగ్ రంగానికి కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చైనా చేపట్టిన ఈ అన్వేషణ భవిష్యత్తులో సముద్ర గర్భ ఖనిజాలపై మరిన్ని పరిశోధనలకు, అలాగే కొత్త సాంకేతికతల అభివృద్ధికి దారితీసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఐర్లాండ్ విలీనంపై అగ్గి రాజేసిన ట్రంప్


