డ్రాగన్ గాలిలోకి ఎగిరే భీకర జంతువే కాని వాస్తవంగా లేని మిథ్యామృగం. భూగోళంపై అతిపెద్ద బలమైన జంతువైన ఏనుగు మృదుస్వభావి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను డ్రాగన్‌గా, మన భారతీయ ప్రజాస్యామ్య దేశాన్ని ఏనుగుగా పోల్చడం సహజంగా మీడియా చేస్తుంటుంది. ‘టాంగో’ అనేది స్పానిష్ నృత్య సంబంధిత పదం. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో, అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ఆతిథ్యంలో న్యూఢిల్లీలో జరిగే రెండ్రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానుండటం ప్రాధాన్యతసంతరించుకుంది. చివరిదాకా ఆయన పర్యటనపై స్పష్టతనివ్వని చైనా ఎట్టకేలకు 67 మంది సభ్యుల ప్రాతినిధ్య బృందంతో రావడం ఇరుదేశాల సంబంధాల్లో సానుకూలతను సూచిస్తోంది.
దగ్గరకు చేర్చిన అమెరికా
కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్దేశించిన సూచనలపై ఇటీవల చైనా 15వ పంచవర్ష ప్రణాళిక (2026–2030)కు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని 150 దేశాలు, ప్రాంతాలతో వాణిజ్య భాగస్వామ్యం కలిగిన చైనా, ప్రపంచ ద్వితీయ భారీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాకు సవాలు విసురుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్ దిగుమతులపై ఆగస్ట్ 2025 నుంచి అదనంగా 25 శాతం ట్యారిఫ్ విధింపు ప్రభావం, భారత్ – చైనాల మధ్య వాణిజ్య సయోధ్యకు దారి తీసింది. 2025 ఆగస్ట్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిఇండియా రాక సందర్భంలో అయిదు సంవత్సరాల క్రితం ఆగి పోయిన బోర్టర్ ట్రేడ్ ఇటీవలే మళ్ళీ ప్రారంభమైంది.
భారత్, చైనా ఆర్థిక వాణిజ్య బాంధవ్యం రెండు దేశాల 280 కోట్ల జనావళి దృష్ట్యా పటిష్ట మవుతున్నాయి. భారత్–చైనా మధ్య సుదీర్ఘ కాలం నుంచి అత్యంత క్లిష్టమైన భౌగోళిక సరిహద్దు వివాదా లున్నప్పటికీ, వాటిని పక్కకు పెట్టి, వరస్పర ప్రయోజనాల దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకొనే సత్కృషి ప్రారంభమైంది. 2017లో భారత్ అధికార యుతంగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లో చేరింది.
2024 నాటికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అర్థిక సర్వేలోనూ, నీతి ఆయోగ్ నివేదికలోనూ చైనా పెట్టుబడులను దేశంలోకి ఆహ్వానించాలనే సానుకూల ప్రతిపాదన లున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో 2025 అగస్టు 18న జరిపిన న్యూఢిల్లీ సమావేశం కొత్త వాకిళ్ళు తెరిచింది. దానికి తోడు రెండు దేశాల మధ్య 2021 నాటి 125.6 బిలియన్ యూఎస్ డాలర్ల వాణిజ్యం, 2024 నాటికి 138.5కు పెరిగింది.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) బిష్కెక్ శిఖరాగ్ర సమావేశం; యూఎస్, ఇజ్రాయిల్‌లు అంతర్జాతీయ చట్టం, యూఎన్ ఛార్టర్ ప్రాథమిక సూత్ర నియమావళిని ఉల్లంఘించే దుర్నీతిని దుయ్యపట్టడం భారత్, చైనాల సయోధ్యను మరింత బలపరిచాయి. ట్రంప్ శిక్షగా విధించే సుంకాలు, అస్థిర వైఖరి కారణంగా భారత్ యిప్పటికే చైనాతో చేతులు కలుపుతోంది.
సంబంధాల్లో ముల్లు
కానీ పాకిస్తాన్ పట్ల చైనా అనుకూల వైఖరి భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతోంది. ఉగ్ర, వేర్పాటు, తీవ్రవాదాలుసృష్టిస్తున్న యుద్ధ ప్రజ్వలనంలో భాగస్వామ్యమైన పాకిస్తాన్‌ను చైనా వెనకేసుకు రావటం, పైగా పాకిస్తాన్ ఛైర్‌గా రానున్న ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి వేదిక కావటం, భారత్‌కు మింగుడుపడని సమస్య అవుతోంది. దానికి తోడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్టేట్ కౌన్సిల్‌కు చెందిన సెంట్రల్ కమిటీ, ‘యూనియన్ టెర్రిటరీ ఆఫ్ లదాఖ్’లో వున్న నిర్దిష్ట జిల్లాలను హియాన్, హికాంగ్ పేర్లతో రెండు కొత్త కౌంటీలుగా ప్రకటించడానికి అనుమతించింది.
అదీగాక టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర నదిని అక్కడ యార్లుంగ్ సాంగ్‌పో అంటారు. అరుణాచలప్రదేశ్‌లోని మనదేశ సరిహద్దుల సమీపంలో మిడాన్ ప్రాంతంలో కొండవాగు కనుమలలో చైనా నిర్మించనున్న సూపర్ జలవిద్యుత్ కేంద్రం వల్ల ప్రవాహం దిగువలో ఉన్న ఇండియా, బంగ్లాదేశ్‌లకు బ్రహ్మపుత్ర నదీ జలాల వినియోగానికి అవరోధమని భారత్ హెచ్చరిస్తున్నా చైనా పట్టించు కోవడం లేదు. 70 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించే లక్ష్యంగా ఈ ‘ప్రాజెక్ట్ ఆఫ్ ద సెంచరీ’ని చైనా ప్రభుత్వం ప్రస్తుత 2026 నుంచి ప్రారంభించనున్న 15వ పంచవర్ష ప్రణాళికలో చేర్చింది.
గతేడాది జూలైలో ఈ భారీ విద్యుత్ పునరుత్పాదన కేంద్రాన్ని ప్రాధాన్యతా పరంగా కమ్యూ నిస్ట్ చైనా రెండవ అగ్రశ్రేణి నేత, ప్రధాని లిక్వియంగ్ టిబెట్‌లోని నియింగ్చి వద్ద ప్రారంభించారు. 1.2 ట్రిలియన్ యువాన్‌లతో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) అయిదు పవర్ స్టేషన్‌ల నిర్మాణం జరగనుంది. జంగ్ము వద్ద చైనా ఇప్పటికే భారీ జలాశయం నిర్మించింది. ఇండియా–చైనాల మధ్య ట్రాన్స్ బోర్టర్ నదీ జలాలపై నిపుణుల స్థాయి సమావేశం జరగవలసి ఉంది.
పర్యావరణ విధ్వంసం కారణంగా హిమాలయాల మహోన్నత శిఖరాల నుంచి ప్రకృతి ప్రళయాలు అనుభవిస్తూనే ఉన్నాం. జల విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మిస్తున్న జలాశయాలు ప్రవాహ అవరో ధాలకు కారణం అవుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా, నేపాల్ చైనా సరిహద్దులలో ఈ మానవ విధ్వంసం ఆగేటట్టు లేదు. ప్రపంచ అగ్రరాజ్యాలలో ప్రప్రథమ స్థానాన్ని పొందాలనే కమ్యూనిస్ట్ చైనా డ్రాగన్ విజృంభిస్తోంది. ప్రస్తుతం ట్రంప్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలక్రిందులు చేస్తున్న ఈ తరుణంలో ‘డ్రాగన్ – ఎలిఫెంట్‌టాంగో’... వినోదం అవుతుందా? రణక్రీడ కానుందా?
-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
-జయసూర్య


