మక్కా కూటమిని ఎలా చూడాలి? | Sakshi Guest Column On Mecca Joint Defence Agreement | Sakshi
Sakshi News home page

మక్కా కూటమిని ఎలా చూడాలి?

Sep 11 2026 1:08 AM | Updated on Sep 11 2026 1:08 AM

Sakshi Guest Column On Mecca Joint Defence Agreement

విశ్లేషణ

పాకిస్తాన్‌ చొరవతో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా సభ్యులుగా గత నెలలో మక్కాలో ఒక కొత్త సైనిక కూటమికి అంకురార్పణ జరిగింది. ఈ కూటమిని ‘ఇస్లామిక్‌ నాటో’ అని కూడా అభివర్ణిస్తు న్నారు. నెల తిరగకుండానే, ఈ నెల మొదటి తారీఖున మళ్లీ ఈ మూడు దేశాల రక్షణ మంత్రులు, సైన్యాధ్యక్షులు సమావే శమై కూటమి సెక్రటేరియట్, విధివిధా నాల మీద చర్చించారు. ఉమ్మడి భద్రత లక్ష్యంగా ఏర్పడిన ఈ సైనిక కూటమిని నాటో తరహాలో రూపొందించటానికి ప్రయత్నం జరుగుతున్నది. నాటో కూటమి ఒప్పందం ఆర్టికల్‌ ‘5’ ప్రకారం, కూటమి ఏ ఒక్క సభ్య దేశంపైన దాడి జరిగినా దాన్ని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి సైనిక కూటమి తన పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుంది. మక్కా ఒప్పందంలో కూడా ఈ తరహా క్లాజును పొందుపరచటం విశేషం. 

కారణాలేమిటి?
స్థూలంగా పరిశీలిస్తే ఈ కూటమి ఏర్పాటుకు ఇరాన్‌ యుద్ధంలో సౌదీ, కువైట్, బెహ్రయిన్, యూఏఈ వంటి గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ క్షిపణి దాడుల వలన జరిగిన నష్టం ప్రథమ కారణంగా కన్పడు తున్నది. పర్షియా సింధు శాఖలోని రియాద్, ఫుజేరా, కువైట్, దుబాయ్‌ వంటి నగరాలు; చమురు శుద్ధి కేంద్రాలు, డీసాలినేషన్‌ ప్లాంట్లు ఇరాన్‌ మిస్సైల్స్, డ్రోనుల దాడి నుండి తప్పించుకోలేక పోయాయి. సౌదీ, యూఏఈ, బెహ్రయిన్‌ దేశాలలోని నాటో సైనిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. యూఎస్‌ఏ ఏర్పాటు చేసిన మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ఈ దేశాలకు పూర్తి రక్షణను కల్పించ లేకపోయాయి. అమెరికన్‌ సైనిక స్థావరాలుండటమే, ఈ దేశాలపై ఇరాన్‌ దాడి చేయటానికి కారణం. యుద్ధం ఇరాన్‌–అమెరికా/ ఇజ్రా యెల్‌ మధ్య జరుగుతున్నప్పటికీ, గల్ఫ్‌ దేశాలు అడకత్తెరలో పోక చెక్కలా చిక్కుకుపోయాయి. ఇరాన్‌ను నేరుగా ఎదుర్కొనే సైనికశక్తి ఈ దేశాలకు లేదు. అమెరికన్‌ భద్రతా గొడుగు నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా తమకొక ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటానికి జరుగుతున్న ప్రయత్నంగా ఇది కనబడుతోంది. అయితే సౌదీపై హౌతీల దాడులు జరిగినప్పటికీ ఆర్టికల్‌ 5ని ఆచరణలోకి తేలేదు. అది అంత సులభం కాదు.

ఈ కూటమి కేవలం అమెరికన్‌ నాయకత్వంలోని నాటోకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ప్రాంతీయ కూటమి కాకపోవచ్చు. పాకిస్తాన్, టర్కీ పర్షియా సింధు శాఖలోని దేశాలు కాదు. ఈ మూడు దేశాలు సున్నీ ముస్లిమ్‌ దేశాలు. ఇరాన్, ఇరాక్‌ షియా ముస్లిం దేశాలు. పర్షియా సింధుశాఖలోని యూఏఈ ఈ కూటమిలో ప్రస్తుతానికి లేదు. సౌదీ, యూఏఈలకు వ్యూహాత్మక లక్ష్యాలలో వైరుధ్యం ఉన్నది. ఈ రెండు దేశాలు యెమెన్‌లో రెండు సైనిక గ్రూపులను సమర్థిస్తున్నాయి. పాలస్తీనా సమస్యలో ఈ రెండు దేశాల వైఖరిలో అంతరమున్నది. యూఏఈ అబ్రహాం ఒప్పందంపై సంతకం చేసి ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవ టానికి మొగ్గు చూపుతున్నది. సౌదీ అరేబియా సంతకాలకు నిరాక రిస్తున్నది. ఈ మూడూ అమెరికాకు నమ్మకమయిన స్నేహితులు.

ఉమ్మడి శత్రువు లేని కూటమి
పాకిస్తాన్‌కు సుశిక్షితమైన విస్తృత సైనిక బలగం ఉన్నది. ఇప్ప టికే పాక్‌ సైనికులు సౌదీలో విధులు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నది. గల్ఫ్‌ దేశాలకు ఇజ్రాయెల్‌ అణ్వస్త్ర ముప్పును ఎదుర్కోవటానికి అణ్వస్త్రాల సహాయం అవసరం. ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌ లక్ష్యంగానే అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడికి అణుబూచినే ముందు ఉంచుతున్నారు. టర్కీ వద్ద సైనిక విమానాలు, డ్రోన్లు, మందుగుండు సామగ్రి తయారీ సామర్థ్యం విస్తృతంగా ఉన్నది. నాటో సభ్యదేశం కావటంతో ఆధునిక యుద్ధ రీతులు, యుద్ధతంత్రాలు టర్కీకి సుపరిచితం. సౌదీ అరేబియా వద్ద పుష్కలంగా పెట్టుబడి సామర్థ్యం ఉన్నది. కీలకమైన చమురు, సహజ వాయువు నిల్వలున్నాయి. ఈ మూడు దేశాలు చేతులు కలపటంతో బలమైన సైనిక శక్తి ఆవిర్భవించే అవకాశమున్నది.

అయితే, లక్ష్యాలపరంగా కూటమిలోని మూడు దేశాల మధ్య వైరుధ్యం స్పష్టంగా కనబడుతోంది. సైనిక కూటములకు సహజంగా ఉమ్మడి శత్రువులుంటారు. ఉదాహరణకు నాటో కూటమికి బద్ధ శత్రువు పూర్వపు సోవియట్‌ యూనియన్, తరువాత రష్యా. కానీ మక్కా కూటమిలోని సౌదీ అరేబియాకు ఇరాన్, ఇజ్రాయెల్‌ ప్రథమ శత్రువులు. సౌదీ దృష్టంతా పర్షియా సింధుశాఖ, ఎర్ర సముద్రాల పైన ఉంటుంది. టర్కీకి ఇజ్రాయెల్‌ ప్రధాన శత్రువు. టర్కీ తన శక్తియుక్తులను తూర్పు మద్యధరా సముద్రం, సిరియా, జోర్డాన్, లెబనాన్‌లపైన కేంద్రీకరిస్తుంది. పాక్‌కు మధ్యప్రాచ్యంలో ప్రత్యేకంగా శత్రువులెవరూ లేరు. ఇరాన్‌తో కూడా మిత్రత్వ వైఖరినే అవలంబిస్తుంది. ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించినప్పటికీ, శత్రువుగా చూడదు. పాకిస్తాన్‌కు భారతదేశమే లక్ష్యం, శత్రువు. కచ్చితమైన ఉమ్మడి శత్రువు లేకపోవటం కూటమికి పెద్ద బలహీనత.

భారత్‌కు సవాలు
అమెరికన్‌ భద్రతా ఛత్రానికి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయంగా గల్ఫ్‌ దేశాలు తమకంటూ ప్రత్యేకంగా ఒక సైనిక కూటమిని ఏర్పరచుకోవటం స్వాగతించదగినదే. కానీ పర్షియన్‌ సింధుశాఖ ప్రాంతానికి సంబంధం లేని ప్రాంతీయేతర శక్తులు ఇరాన్‌కు వ్యతి రేకంగా సైనిక కూటమిని ఏర్పాటు చేయటం, దానికి పాకిస్తాన్, టర్కీ పునాదిరాళ్లు కావటం భారత్‌ ప్రయోజనాలకు ప్రమాదకరం. ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్తాన్‌–టర్కీ రెండూ జతకట్టి భారత్‌పై దాడి చేశాయి. టర్కీ ఐక్యరాజ్యసమితిలో పలుమార్లు కశ్మీర్‌ విషయంలో భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది. ఆప రేషన్‌ సిందూర్‌లో పాక్‌కు పెద్ద మొత్తంలో డ్రోన్లను, మొబైల్‌ కమాండ్‌ సెంటర్లను, కౌంటర్‌ డ్రోన్‌ టెక్నాలజీని సమకూర్చింది.

మక్కా కూటమి మత ప్రాతిపదికన ఏర్పడటం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఈ కూటమిని ఇస్లామిక్‌ నాటో లేదా సున్నీ నాటోగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మతఛాందస ఇస్లా మిక్‌ టెర్రరిజం భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద భద్రతా ప్రమాదం. కానీ ఈ సైనిక కూటమిని అమెరికా సమర్థించటం కొసమెరుపు. ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో కూటమిని విస్తరించ టానికి సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈజిప్ట్, ఖతార్, బంగ్లాదేశ్‌ ఈ కూటమిలో చేరటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా వార్త లొస్తున్నాయి. బంగ్లాదేశ్‌ ఈ కూటమిలో చేరటం సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌ నూతన ప్రభుత్వం పాక్, చైనాలకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసింది. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ, టర్కీలు భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపే దుశ్శకునాలు కన్పడుతున్నాయి. జియోపాలిటిక్స్‌లో ఏదైనా జరగ వచ్చు. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ కూటమి అడుగులను నిశితంగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కూటమికి ప్రతిగా భారత్‌ చొరవ తీసుకొని యూఏఈ, ఇజ్రాయెల్, జపాన్‌లతో చేయికలిపి ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement