ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పోర్ట్స్‌మౌత్‌లోని ఓ హోటల్‌లో బస చేసిన పాక్ యువ ఆటగాళ్లను అక్రమ శరణార్థులుగా పొరబడిన నిరసనకారులు..వారుంటున్న హోటల్‌ను చుట్టుముట్టడం తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
పోర్ట్స్‌మౌత్ నగర సమీపంలోని 'మారియట్' హోటల్‌లో పాక్ జట్టు బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఆటగాళ్లు బస్సు దిగి హోటల్లోకి వెళ్లడాన్ని చూసిన కొందరు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేశారు. వారంతా ఆశ్రయం కోసం వచ్చిన అక్రమ శరణార్థులని భావించిన దాదాపు 40 మందికి పైగా నిరసనకారులు వెంటనే హోటల్ ముట్టడికి దిగారు.
తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు, స్థానిక ‘రిఫార్మ్ యూకే’ పార్టీ కౌన్సిలర్ నిరసనకారులకు నచ్చజెప్పారు. అక్కడ ఉన్నది శరణార్థులు కాదని, పాకిస్తాన్ అండర్-19 క్రికెటర్లని స్పష్టం చేశారు. నిజం తెలుసుకున్న నిరసనకారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
కాగా పాకిస్తాన్ సీనియర్ పురుషుల జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే ఉండడం గమనార్హం. బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.
కాగా ఈ ఘటనపై ‘స్టాండ్ అప్ టు రేసిజం’ వ్యవస్థాపకుడు మైఖేల్ బ్రాడ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శరణార్థులపై ఉన్న ద్వేషం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని మండిపడ్డారు.
చదవండి: 'జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఫామ్‌లోకి వస్తాడు'


