IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్‌కోచ్‌గా వస్తా? | Eoin Morgan demands 20 crore for CSK head coach role | Sakshi
Sakshi News home page

IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్‌కోచ్‌గా వస్తా?

Sep 9 2026 11:32 AM | Updated on Sep 9 2026 11:38 AM

Eoin Morgan demands 20 crore for CSK head coach role

PC: IPL/BCCI

ఐపీఎల్‌-2027 సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ కొత్త హెడ్‌కోచ్‌ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డింది. హేమాంగ్ బదానీ, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ ఆటగాళ్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. మేనేజ్‌మెంట్ మాత్రం విదేశీ కోచ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో సీఎస్‌కే యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మోర్గాన్ ఈ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ఏకంగా రూ. 18 నుండి 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు 'రేవ్‌స్పోర్ట్స్'కథనం పేర్కొంది.

కాగా ఇప్ప‌టివ‌ర‌కు అంతర్జాతీయ స్థాయి లో గానీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో గానీ కోచ్‌గా పనిచేసిన ఎలాంటి అనుభవం మోర్గాన్‌కు లేదు. అయిన‌ప్ప‌టికి అతడు ఈ స్థాయిలో భారీ వేతనం అడగడం సీఎస్‌కే అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

కోచింగ్ అనుభవం లేని మోర్గాన్‌కు రూ. 20 కోట్లు ఇవ్వడం కంటే.. ఇప్పటికే జట్టుతో ప‌నిచేస్తున్న‌ ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ మైఖెల్ హస్సీని హెడ్‌కోచ్‌గా ప్రమోట్ చేయడమే బెటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్న దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని హెడ్‌కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని మరికొందరు సూచిస్తున్నారు.

కాగా కోచ్‌గా అనుభవం లేకపోయినా.. మోర్గాన్‌ కెప్టెన్‌గా మాత్రం ఇంగ్లండ్‌కు 2019 వన్డే వరల్డ్‌కప్‌ను అందించాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో కేకేఆర్‌ను రన్నరప్‌గా నిలిపాడు. వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో అత‌డి దిట్ట‌. అయితే అతడి భారీ డిమాండ్‌కు సీఎస్‌కే మేనేజ్‌మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
చదవండి: Asia Cup: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement