బెంగళూరు: పసిడి పతకమే లక్ష్యంగా భారత మహిళల, పురుషుల హాకీ జట్లు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలకు బయలుదేరాయి. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 4 వరకు ఐచి–నగోయా నగరాల్లో ఆసియా క్రీడలు జరగనుండగా... భారత జట్లు మంగళవారం పయనమయ్యాయి. ఇటీవల జరిగిన హాకీ వరల్డ్‌కప్‌లో ఐదో స్థానంలో నిలిచిన సలీమా టెటె సారథ్యంలోని భారత మహిళల జట్టు... ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి తద్వారా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలని భావిస్తోంది.
ఈ జట్టుకు జోయర్డ్ మరీనె హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 1974లో నిర్వహించిన మొదటి మహిళల హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా... ఆ తర్వాత ఇటీవలే అత్యుత్తమంగా ఐదో స్థానంలో నిలిచింది. ‘పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆసియా క్రీడలకు బయలుదేరుతున్నాం. ప్రతి టోర్నమెంట్‌లో కొత్త సవాల్‌లు ఎదురువడం సహజం. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం అనే నమ్మకముంది’ అని కెపె్టన్ సలీమా వెల్లడించింది.
ఇటీవలి కాలంలో నేషన్స్ కప్, వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం తమ ఆటతీరుకు నిదర్శనమని ఆమె చెప్పింది. ‘మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఆసియా గేమ్స్‌లో అగ్రస్థానంలో నిలవడం ద్వారా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌నకు అర్హత సాధించాలనుకుంటున్నాం. అందుకు కావాల్సిన విధంగా ఆడుతాం. క్రమశిక్షణ, నిలకడ ముఖ్యం. ప్రతీ మ్యాచ్‌లో దీన్ని కొనసాగించాలనుకుంటున్నాం. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలం’ అని సలీమా వివరించింది.
పటిష్ట జట్టుతో..
ఆతిథ్య జపాన్, థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేసియా, ఉజ్బెకిస్తాన్‌లతో కలిసి భారత మహిళల జట్టు పూల్ ‘బి’ నుంచి పోటీపడనుంది. సెపె్టంబర్ 20న ఉజ్బెకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం 21న ఇండోనేసియాతో, 23న థాయ్‌లాండ్‌తో, 25న జపాన్‌తో, 27న సింగపూర్‌తో తలపడనుంది. పూల్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు సెమీఫైనల్ చేరుతాయి. ఈ నెల 30న సెమీఫైనల్ ... అక్టోబర్ 2న ఫైనల్ జరుగుతుంది. ఈ క్రీడల కోసం కెపె్టన్ సలీమా టెటె సారథ్యంలో 20 మందితో కూడిన జట్టును ప్రకటించారు.
అందులో సవితతో పాటు బిచ్చూ దేవి గోల్ కీపర్‌లు కాగా... ఇషిక, సుశీలా చాను, లాల్‌థన్‌లువాంగి, జ్యోతి, శిల్పి రూపంలో ఐదుగురు డిఫెండర్లు... నిక్కీ ప్రధాన్, సాక్షి రాణా, సునెలితా టొప్పో, సలీమా టెటె, నేహా, దీపిక సొరెంగ్ రూపంలో ఆరుగురు మిడ్‌ఫీల్డర్స్... లాల్‌రెమ్‌సియామి, రుతుజా, నవ్‌నీత్, దీపిక, ఇషిత, బల్‌జీత్ కౌర్, బ్యూటీ డుంగ్‌డుంగ్ రూపంలో ఏడుగురు ఫార్వర్డ్స్‌గా ఉన్నారు. ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో రజతం నెగ్గిన టీమిండియా... నేషన్స్ కప్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు అజేయంగా నిలిచింది. అమెరికా, జపాన్, ఉరుగ్వే, చిలీ, న్యూజిలాండ్‌ను మట్టికరిపించి టైటిల్ కైవసం చేసుకుంది.


