ఆసీస్‌ సిరీస్‌కు భారత జట్టులోకి సర్‌ప్రైజ్‌ ఎంట్రీ | Who Is Nachiket Bhute, The Surprise Name In India A Squad For Australia A Series | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ సిరీస్‌కు భారత జట్టులోకి సర్‌ప్రైజ్‌ ఎంట్రీ

Sep 9 2026 6:44 PM | Updated on Sep 9 2026 8:18 PM

Who Is Nachiket Bhute, The Surprise Name In India A Squad For Australia A Series

source: X

త్వరలో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగనున్న రెండు ఫార్మాట్ల సిరీస్‌కు భారత జట్లను ఇవాళ ప్రకటించారు. మల్టీ డే మ్యాచ్‌లకు దేవదత్‌ పడిక్కల్‌, వన్డే జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్లుగా ఎంపిక కాగా.. మల్టీ డే ఫార్మాట్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో ఓ ఆసక్తికర ఎంపిక జరిగింది.

దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న విదర్భ ఆల్‌రౌండర్‌ నచికేత్‌ భూటేకు ఊహించని అవకాశం దక్కింది. నచికేత్‌ తొలిసారి భారత ఎ జట్టుకు ఎంపికయ్యాడు. గత రంజీ సీజన్‌లో 29 వికెట్లతో అదరగొట్టిన ఈ 26 ఏళ్ల ఆటగాడి కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.

రైట్‌ఆర్మ్ మీడియం పేసర్, రైట్‌హ్యాండ్ బ్యాటర్ అయిన నచికేత్‌.. కొత్త బంతితో అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేయడంలో దిట్ట. అలాగే లోయర్‌ ఆర్డర్‌లో కీలక బ్యాటర్‌ కూడా. 2018-19లో విదర్భ అండర్-19 జట్టు వినూ మన్కడ్ ట్రోఫీ సాధించడంలో నచికేత్‌ కీలకపాత్ర పోషించాడు. అనంతరం అండర్-23 స్థాయిలోనూ తన ప్రతిభ చాటాడు.

2019-20 సీకే నాయుడు ట్రోఫీలోనూ నచికేత్‌ కీలక ప్రదర్శనలు చేశాడు. ఆ సీజన్‌లో అతడు 8 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీసి తన జట్టు టైటిల్‌ గెలవడంలో ప్రధానపాత్ర పోషించాడు.

2021లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా సీనియర్ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నచికేత్‌..  ఆ తర్వాత లిస్ట్ ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కూడా అరంగేట్రం చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన నచికేత్‌ 50 వికెట్లు సాధించాడు. 

గత రంజీ సీజన్‌లో 29 వికెట్లు తీసిన నచికేత్‌ విదర్భ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లోనూ నచికేత్‌ ఈ సీజన్‌లో (2 అర్ద సెంచరీల సాయంతో 196 పరుగులు) రాణించాడు. ఈ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొనే సెలెక్షన్‌ కమిటీ అతన్ని ఆసీస్‌ ఎతో సిరీస్‌కు ఎంపిక చేసింది.

కాగా, ఆసీస్‌ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్లలో మరో ఆశ్చర్యకర ఎంపిక కూడా జరిగింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను వన్డే జట్టుకు ఎంపిక చేశారు. హార్దిక్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. 

రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు భారత పర్యటనకు వస్తోంది. సెప్టెంబరు 22- అక్టోబరు 11 వరకు జరిగే ఈ రెండు సిరీస్‌లకు పుదుచ్చేరి వేదిక.

ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టులకు భారత-‘ఎ’ జట్టు
అమన్‌ మోఖడే, ఆయుశ్‌ పాండే, దేవదత్‌ పడిక్కల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌ (వైస్‌ కెప్టెన్‌), యశ్‌ రాథోడ్‌, షేక్‌ రషీద్‌, కుమార్‌ కుశాగ్ర (వికెట్‌ కీపర్‌), షామ్స్‌ ములాని, తనుష్‌ కొటియాన్‌, తుషార్‌ దేశ్‌పాండే, అన్షుల్‌ కాంబోజ్‌, ప్రఫుల్‌ హింగే, నారాయణన్‌ జగదీశన్‌ (వికెట్‌ కీపర్‌), నచికేత్‌ భూటే, వి వైశాక్‌* (ఫిట్‌నెస్‌ ఆధారంగా).

ఆసీస్‌ ‘ఎ’తో అనధికారిక వన్డేలకు భారత-‘ఎ’ జట్టు
ప్రియాన్ష్‌ ఆర్య, సాయి సుదర్శన్‌, దేవదత్‌ పడిక్కల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, కుమార్‌ కుశాగ్ర (వికెట్‌ కీపర్‌), నిశాంత్‌ సింధు, విప్రాజ్‌ నిగమ్‌, అర్షిన్‌ కులకర్ణి, అర్షద్‌ ఖాన్‌, నమన్‌ ధిర్‌, హార్దిక్‌ పాండ్యా (ఫిట్‌నెస్‌ ఆధారంగా), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), గుర్జప్రీత్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌.

చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్‌ పాండ్యాకు చోటు


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement