సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రీడా ఉత్సాహాన్ని నింపిన ‘సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్’ (సీసీపీఎల్) రెండో సీజన్‌కు కూడా మళ్లీ హైదరాబాదే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆటగాళ్ల వేలం పూర్తయింది.
థాయిలాండ్‌లోని ఫుకెట్ వేదికగా సెప్టెంబరు 3 నుంచి 6 వరకు నిర్వహించిన సీజన్-2 ఆటగాళ్ల వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. గత ఏడాది 'హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్' (హెచ్‌పీఎల్) పేరిట 8 ఫ్రాంచైజీ జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పుడు 'సీసీపీఎల్'గా మరింత ఆకర్షణీయంగా రెండో సీజన్‌కు సిద్ధమైంది. ఈ లీగ్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది.
ముగిసిన ఆటగాళ్ల వేలం..రిటెన్షన్ల హంగామా
పుకెట్‌లోని 'కోకోనట్ పికిల్‌బాల్ సెంటర్'లో రెండో సీజన్ కోసం క్రీడాకారుల వేలం నిర్వహించారు. దీనికి ముందే పలు ఫ్రాంచైజీలు తమ కీలక ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాయి.
గత సీజన్ చాంపియన్ మ్యావెరిక్స్ జట్టు శ్రీకర్ మొతుకూరిని అట్టిపెట్టుకోగా, రన్నరప్ ఆల్ స్టార్స్ జట్టులోకి సమీర్ వర్మ తిరిగి వచ్చాడు. మిఖిల్ తుమ్మలపల్లి, వివేక్ రెడ్డి తమ పాత ఫ్రాంచైజీల తరఫునే బరిలోకి దిగనున్నారు. కరుణేష్ రెడ్డి, అభయ వేమూరి, గోపీనాథ్ రెడ్డి కూడా రిటెయిన్ ఆటగాళ్ల జాబితాలో నిలిచారు.
పూర్తి కొత్త జట్టుతో
మరోవైపు.. చార్జర్స్ జట్టు మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అమలు చేసింది. ఒక్కరిని కూడా రిటెయిన్ చేసుకోకుండా నేరుగా ఫుల్ బడ్జెట్‌తో వేలంలోకి దిగి కొత్త జట్టును నిర్మించుకుంది. రిటెన్షన్ తర్వాత మిగిలిన స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు వేలంలో పోటాపోటీగా తలపడ్డాయి.
ఆరు వారాల్లో రెండో సీజన్
"లీగ్ ప్రస్థానం హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది. ఇక్కడి నుంచే ఫ్రాంచైజీ ఆధారిత పికిల్‌బాల్ లీగ్ సామర్థ్యాన్ని గుర్తించాం. తొలి సీజన్ అనుభవాలతో రెండో సీజన్ ను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం" అని సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ వ్యవస్థాపకుడు యశ్వంత్ బియ్యాల తెలిపారు.
మరో సహ వ్యవస్థాపకుడు విక్రాంత్ రావు మాట్లాడుతూ.. ఆటగాళ్ల రిటెన్షన్లు, ప్రీ-ఆక్షన్ పిక్స్ ద్వారా ఈ సీసన్‌లో ఫ్రాంచైజీల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో స్పష్టమైందని పేర్కొన్నారు. పుకెట్‌లో వేలం ప్రక్రియ పూర్తి కావడంతో లీగ్ ప్రారంభానికి ఆరు వారాల సమయం ఉంది. జట్లన్నీ సమాయత్తమవ్వడానికి ఇది సరైన సమయమని నిర్వాహకులు వెల్లడించారు.


