మాస్క్‌ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది! | Mask Thief Caught By Scar | Sakshi
Sakshi News home page

మాస్క్‌ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది!

Sep 9 2026 6:02 AM | Updated on Sep 9 2026 6:04 AM

Mask Thief Caught By Scar

48 గంటల్లో దొంగ ఆట కట్టించిన పోలీసులు

నిందితుడు గౌరేష్‌ కంటిపై మచ్చ

హైదరాబాద్‌: పోలీసులు గుర్తించకుండా మాస్క్‌ పెట్టుకొని దొంగతనానికి పాల్పడిన నిందితుడిని కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడిన ఓ మచ్చ పట్టించింది. దొంగతనం జరిగిన 48 గంటల్లోనే జూబ్లీహిల్స్‌ క్రైం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌రోడ్‌ నెం.10లో నివసించే ప్రముఖ మద్యం వ్యాపారి శైలేందర్‌ సింగ్‌ బగ్గా ఇంట్లోకి గత నెల 31న ఓ దొంగ ప్రవేశించి అల్మారాలోని  నగలు తస్కరించి పరారయ్యారు.

అంతకుముందు ఇదే రోడ్డులో రెండు ఇళ్లల్లో దొంగతనానికి యత్నించి విఫలమై మూడో ఇల్లు శైలేందర్‌ సింగ్‌ బగ్గా ఇంట్లో పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించగా ఆయన భార్య నీలు కౌర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇక్కడ సీసీ ఫుటేజీలు, వేలి ముద్రలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి మాస్క్‌ ధరించగా కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడ్డ ఓ మచ్చను పోలీసులు గమనించారు. పాత నేరస్తుల కదలికలను పరిశీలించిన కనురొమ్మలపై మచ్చ ఉన్న వ్యక్తిని గుర్తించారు.

గత నెల మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగతనం చేసిన కేసులో నిందితుడి వివరాలు నమోదయ్యాయి. ఈ మచ్చ ఆధారంగా పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పెందుర్తికి చెందిన గౌరేష్‌(27) బంజారాహిల్స్‌రోడ్‌ నెం. 2లోని ఇందిరానగర్‌లో అద్దెకు ఉంటూ జూనియర్‌ ఆరి్టస్ట్‌గా పని చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలపై దృష్టి పెట్టాడు.   శైలేందర్‌ సింగ్‌ బగ్గా ఇంట్లో పది తులాల బంగారం దొంగతనం చేసి అందులో కొంత విక్రయించి  గోవాకు ఫ్లైట్‌లో వెళ్ళాడు.

గోవాలో ఓ క్యాసినోలో జూదం ఆడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. బంగారం రికవరీ చేసే దిశలో పలు కోణాల్లో విచారణ కొనసాగుతున్నది. చోరీ జరిగిన 48 గంటల్లోనే క్రైం పోలీసులు నిందితుడిని పట్టుకోవడంలో విజయం సాధించారు. నిందితుడు గౌరేష్‌ గతంలో మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చి పేకాట కోసం జూబ్లీహిల్స్‌లో దొంగతనం చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement