తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు | Telangana Assembly Heated Arguments Harish Rao Speaker Gaddam Prasad Kumar | Sakshi
Sakshi News home page

తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు

Sep 9 2026 3:04 AM | Updated on Sep 9 2026 3:04 AM

Telangana Assembly Heated Arguments Harish Rao Speaker Gaddam Prasad Kumar

హరీశ్‌రావుపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేల అంశంపై బీఆర్‌ఎస్‌ నిరసన

రెండోరోజూ సభను కుదిపేసిన అసెంబ్లీ వద్ద జరిగిన ఘటన

ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై సభలో మాటల యుద్ధం

వెల్‌లోకి దూసుకెళ్లిన బీఆర్‌ఎస్‌ సభ్యులు.. సభ వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: రెండోరోజూ శాసనసభ అట్టుడికింది. మంగళవారం జరిగిన సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య, స్పీకర్‌–హరీశ్‌రావు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ.. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. అదే సమయంలో సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం సభను కుదిపేసింది.

సభలో సభ్యులను ఉద్దేశించి అంతగా మాట్లాడని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్‌ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. హరీశ్‌రావు లేచి సోమవారం జరిగిన ఘటనను ప్రస్తావించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. వారిపై కేసులు పెట్టారు. మరి వారిపై దాడి చేసిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

ఆగ్రహించిన స్పీకర్‌– హరీశ్‌పై ఆగ్రహం
హరీశ్‌ మాటలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ వెంటనే స్పందించారు. మహిళా సభ్యుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. జరిగిన ఘటనపై ఇప్పటికే పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. స్పీకర్‌ సమాధానంతో సంతృప్తి చెందని బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ బెదిరింపులకు నేను భయపడను. మీరు చేస్తున్నది తప్పు’అంటూ ప్రతిపక్ష సభ్యులను హెచ్చరించారు. అంతలోనే అసెంబ్లీ బయట తనపై, తన తల్లిపై చేసిన వ్యాఖ్యల అంశాన్ని స్పీకర్‌ ప్రస్తావించారు. ‘మీరెందుకు ఆవేశపడుతున్నారు హరీశ్‌ ? నా సంగతేంటో చెప్పు? మీ తల్లిని ఎవరూ తిట్టలేదు. నా తల్లిని తిట్టారు. మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆవేశపడాల్సింది నేను. బీఆర్‌ఎస్‌ నాయకులు మీ తల్లి గురించి మాట్లాడలేదు.. నా తల్లి గురించి మాట్లాడారు. దీనిపై ఏం చేద్దామో ముందు చెప్పండి’అని స్పీకర్‌ తీవ్ర భావోద్వేగానికి గురవడంతో సభలో కొద్దిసేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకుంటారా : మంత్రి శ్రీధర్‌బాబు
ఈ సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకున్నారు. మహిళా ఎమ్మెల్యేల ఘటనపై ప్రభుత్వం కూడా నివేదిక కోరిందని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. అదే సమయంలో సభాపతిని అవమానించేలా వ్యవహరించడం, బెదిరించడం సరికాదన్నారు. సభ్యుడు రాంచంద్ర నాయక్‌ కూడా బీఆర్‌ఎస్‌పై తీవ్రంగా మండిపడ్డారు.

  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ స్పీకర్‌ స్థానంలో దళితుడిని కూర్చోబెట్టడం ఇష్టం లేకనే కేసీఆర్‌ సభకు రావడం లేదని ధ్వజమెత్తారు. గతంలో దళితులను అవమానించిన చరిత్ర కేసీఆర్‌దని, స్పీకర్‌పై కాగితాలు విసిరారని దళితుడైన సంపత్‌కుమార్‌ను, కోమటిరెడ్డిని సభ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు.

మహిళలను ముందు పెట్టి.. మీరు వెనుకా: సీతక్క
అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. సబితా ఇంద్రారెడ్డిని ఎవరు తోశారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి మీరు వెనుక ఉండటం ఏమిటని బీఆర్‌ఎస్‌ నేతలను నిలదీశారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై బీఆర్‌ఎస్‌ నేతలు చేయిచేసుకున్నారని, దీనికి సంబంధించిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

వెల్‌లోకి బీఆర్‌ఎస్‌ సభ్యులు
ఇరువర్గాల వాదనలు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్‌ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా వెల్‌లోకి వెళ్లారు. కొందరు సభ్యుల చేతుల్లో ఉన్న ప్లకా ర్డులను చీఫ్‌ మార్షల్‌ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పోడి యం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్‌ వారిని అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం మరింత పెరిగింది. బీఆర్‌ఎస్‌ మహిళా సభ్యులపై జరిగిన దౌర్జన్యం. అవమానంపై ప్లకార్డులు పెట్టుకొని పోడియంలోకి సభ్యులు మళ్లీ దూసుకెళ్లారు.

22ఏపై బీజేపీ ఆందోళన
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 22ఏ నిషేధిత జాబితా అంశంపై చర్చకు పట్టుబట్టా రు. బీజేపీ సభ్యులు కూడా ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో సభలో ఒకవైపు బీఆర్‌ఎస్‌–కాంగ్రె స్‌ మధ్య వాగ్వాదం, మరోవైపు 22ఏ అంశంపై బీజే పీ నిరసనతో పరిస్థితి మరింత గందరగోళంగా మా రింది. బీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియం వైపు దూసుకెళ్లడంతో మార్షల్స్‌ వారిని అడ్డుకున్నారు. సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో సభను కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో స్పీకర్‌ సభను ఉదయం 10.45 గంటలకు వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పీకర్‌ చాంబర్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత సభ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరిగి ప్రారంభమై కొనసాగింది.  

క్షమాపణ చెప్పాడు.. మళ్లీ ఎందుకు: హరీశ్‌రావు
హరీశ్‌రావు మరోసారి జోక్యం చేసుకొని.. స్పీకర్‌ పట్ల తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఇప్పటికే క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలపై కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ‘స్పీకర్‌ గారంటే మాకు గౌరవం ఉంది. వ్యక్తిగతంగా కూడా మీ పట్ల గౌరవం ఉంది. అయితే మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారు’అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: అసలు హరీశ్‌రావుకు మైక్‌ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement