హైదరాబాద్‌లో షూటింగ్స్ సందడి
కథ డిమాండ్ చేస్తే చాలు.. తమ సినిమాల షూటింగ్స్ కోసం దేశ విదేశాలు చుట్టేస్తుంటారు మేకర్స్. పైగా తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా పరిధి దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుతోంది. అందుకే కాబోలు స్వదేశంతో పాటు బడ్జెట్ ఎక్కువ అయినా విదేశాల్లోనూ షూటింగ్స్‌కి ఏమాత్రం వెనకాడటం లేదు. పలు సినిమాల చిత్రీకరణలు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంటే మరికొన్ని మూవీస్ షూటింగ్స్ విదేశాల్లోనూ జరుగుతున్నాయి.
అయితే మెజారిటీ సినిమాలు మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ హబ్‌గా చెప్పుకునే హైదరాబాద్‌లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్‌లు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, గోపీచంద్, శర్వానంద్, శ్రీ విష్ణు... వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్‌లో హుషారుగా పాల్గొంటున్నారు. మరి... ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.
కాలేజ్‌లో కాకా...
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ఈ సినిమాకి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్, సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ కాలేజ్‌లో జరుగుతోంది.
ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ బాబీ. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని సరికొత్త తరహా పాత్రలో చూపించనున్నారట ఆయన. ‘‘చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రకటన నుంచే ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్‌లో చూపించిన విధానం, పవర్‌ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ కలిసి గ్లింప్స్‌ను ఆసక్తికరంగా మార్చాయి.
మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్‌తో కనిపించగా, యంగ్ వెర్షన్‌లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటాయి. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్...’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది. సంక్రాంతి సందర్భంగా ‘కాకా’ సినిమాని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
అజీజ్ నగర్‌లో...
వరుస పాన్ ఇండియన్ మూవీస్‌తో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఏకకాలంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారాయన. ఓ వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘ఫౌజీ’ మూవీలో నటిస్తున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో జరుగుతోంది.
ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ‘ఫౌజీ’ని రూపొందిస్తున్నాం. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్‌లో కనిపించనున్నారు ప్రభాస్. డిసెంబరు 3న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, విడుదల చేసిన ప్రభాస్ సరికొత్త పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ యోధుడిలా, రక్తంతో తడిసిన దుస్తులు, శరీరమంతా గాయాలతో, చుట్టూ నేలకూలిన సైనికుల మధ్య తుపాకీని పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ లుక్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శంషాబాద్‌లో...
మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి.
‘‘సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘వారణాసి’ నుంచి మహేశ్ రెండు స్పెషల్ స్టిల్స్‌ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు స్టిల్స్ చూస్తే ‘వారణాసి’ సినిమా సోల్, రుద్ర పాత్ర తీరు అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుంచి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు, 120 దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ‘వారణాసి’లో శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా
ఐమాక్స్‌లో విడుదల కానుంది.
అల్యూమినియం ఫ్యాక్టరీలో...
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ చిత్రం ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనార్కలి నజర్ హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ‘‘విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘సింగ’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న ‘సింగ’ టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.
యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్‌ఫుల్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించేలా వెంకట్ ఒక గ్రిప్పింగ్ కథని సిద్ధం చేశారు. ఈ మూవీ నుంచి గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్‌లో రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్‌గా నిలిచింది. టైటిల్ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందింది. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో చూపించారో ఈ గ్లింప్స్‌తోనే నిరూపించారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. కెమెరామెన్ షామ్‌దత్. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
ముచ్చింతల్‌లో...
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్లతో పాటు ముఖ్యమైన నటీనటులు పాల్గొంటున్నారట. ‘‘పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘భోగి’. శర్వానంద్–సంపత్ నందిల కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
శర్వానంద్ కెరీర్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన, లెన్తీ యాక్షన్ షెడ్యూల్‌ను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్‌తో కూడిన ప్రదేశాల్లో తెరకెక్కించాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రంలోని శర్వానంద్ రగ్డ్, గ్రాండ్ స్కేల్ విజన్‌కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమా పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్ లుక్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాని ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాయిదా పడింది.
శంకర్‌పల్లిలో...
హీరో శ్రీ విష్ణు–డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్æ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. ఈ మూవీలో రెబ్బా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించారు. అనిల్ సుంకర, రాజేష్ దండ నిర్మించిన ఈ మూవీ 2023 జూన్ 28న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి వినోదాలు అందించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.
‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెకక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపిస్తుందని యూనిట్ పేర్కొంది.
ఆర్‌ఎఫ్‌సీలో...
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్ర ఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024 జనవరి 12న విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆంజనేయస్వామి పాత్రను ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషభ్ శెట్టి పోషిస్తున్నారు.
‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హంపీలోని అంజనాద్రి బెట్టలో ఆరంభం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ వర్మ. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అన్న నేపథ్యంలో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. ‘హనుమాన్’లో హనుమంత్‌గా నటించిన తేజ సజ్జా ‘జై హనుమాన్’లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషించనున్నారట.
సంబరాల జోరు
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. సాయిదుర్గా తేజ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు రూపొందిస్తున్నారట రోహిత్ కేపీ. ‘‘ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది’’ అని యూనిట్ పేర్కొంది.
ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని సినిమాల చిత్రీకరణలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి.
– డేరంగుల జగన్ మోహన్


