‘‘ఒక నటుడిగా ఇప్పటివరకూ విభిన్నమైన జానర్స్‌లో డిఫరెంట్ పాత్రలు చేశాను. ఒకే జానర్‌లో సినిమాలు చేయాలని ఎప్పుడూ ఫిక్స్ కాలేదు. హీరో పాత్రలు చేయడంతో పాటు బలమైన సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ కూడా చేశాను. ఇప్పుడు కూడా విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆ క్యారెక్టర్స్‌లో డెప్త్ ఉండాలి’’ అని సుమంత్ చెప్పారు. సుమంత్, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో సిద్ధు జొన్నలగడ్డ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో సుమంత్ చెప్పిన విశేషాలు...
⇒ ‘మహేంద్రగిరి వారాహి’లో యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మూఢనమ్మకాల గురించి చర్చించే క్యారెక్టర్‌లో నటించాను. ఇదొక డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ ఇందులో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీక్వెన్స్, వాణిజ్యపరమైన అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ఒక వంశంలోని వ్యక్తులు 33 ఏళ్ల వయసు దాటిన తర్వాత చనిపోవడం అనే పాయింట్ మా సినిమా ట్రైలర్‌లో కనిపించింది. ఈ పాయింట్ ‘మురారి’ సినిమాను కూడా గుర్తు చేస్తున్నప్పటికీ మా ‘మహేంద్రగిరి వారాహి’ కథ, స్క్రీన్‌ప్లే చాలా భిన్నంగా ఉంటాయి.
⇒ దర్శకుడు సంతోష్ ఈ సినిమా కంటే ముందు నాకు వేరే కథ చెప్పాడు. కానీ ఆ కథ నచ్చలేదు. ఆ తర్వాత ‘మహేంద్రగిరి వారాహి’ కథ చెప్పగా నచ్చింది. వేదాలు, పురాణాల పట్ల మంచి అవగాహన ఉన్న సంతోష్‌కి ఇది సరైన సబ్జెక్ట్ అనిపించింది. ఈ చిత్రం ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. ముందు ఈ సినిమాను ఇంత బిగ్ స్కేల్‌లో తీస్తారని అనుకోలేదు. షూటింగ్ 60 శాతం పూర్తయిన తర్వాత నిర్మాత లక్ష్మణ్‌గారు మాకు తోడయ్యారు. ఈ సినిమాలోని ఓ సీరియస్ కీ రోల్‌ను సిద్ధు జొన్నలగడ్డ చేశాడు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గారి రీ–రికార్డింగ్, మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
⇒ ప్రస్తుతం మైథాలజీ ట్రెండ్ నడుస్తోందని ఈ సినిమా చేయలేదు. ‘కార్తికేయ 2, ‘కాంతార’ సినిమాల కంటే ముందే ఈ సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేయించాం. కాకపోతే ఆ సమయంలో మా సినిమా మేకింగ్‌కు సరైన నిర్మాత సహకారం లేదు. ఏడాది ఆ తర్వాత మధుగారు, ఆ తర్వాత లక్ష్మణ్‌గారు ఈ సినిమా ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
⇒ ఇటీవల జరిగిన మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ గురించి సరదాగా మాట్లాడాను. తనని అయ్యగారు అని పిలుస్తుంటారట. అక్కినేనిగారి అందరి మనవళ్లలో నేనే పెద్దవాడిని. పెద్దవాడిని కాబట్టి అయ్యగారు అంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో సరదాగా అన్నాను. అది ట్రెండ్ అయ్యిందని మా వాళ్ళు నాకు చెప్పారు.


