బిగ్‌బాస్(హిందీ) 20వ సీజన్ ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌లో నటులు, గాయకులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్, గాయకుడు ఖాజీ తౌకీర్ కూడా పోటీదారులుగా ఉన్నారు. తొలి రోజే ఇంట్లో వాదోపవాదాలు మొదలయ్యాయి.
సింగిల్ బెడ్ కోసం పోటీ
రియాలిటీ టీవీలోకి తొలిసారి అడుగుపెట్టిన మేరీ కోమ్.. మొదటి రోజే తన ఉనికిని చాటుకున్నారు. బిగ్‌బాస్ ఇంట్లో సింగిల్, డబుల్ బెడ్లు ఉన్నాయి. ఒక సింగిల్ బెడ్ విషయంలో మేరీ కోమ్, ఖాజీ తౌకీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వయసు, క్రీడా రంగంలో తనకున్న గుర్తింపు దృష్ట్యా సింగిల్ బెడ్ తనకే ఇవ్వాలని మేరీ వాదించినట్లు సమాచారం. వెన్నునొప్పి ఉందని, ఒంటరిగా పడుకుంటే సౌకర్యంగా ఉంటుందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఖాజీ మాత్రం వెనక్కి తగ్గలేదు
అయితే ఖాజీ తౌకీర్ ఆ బెడ్‌ను వదులుకోవడానికి నిరాకరించారు. మరో బెడ్‌ను ఎంచుకోవాలని మేరీకి సూచించినట్లు సమాచారం. డబుల్ బెడ్‌ను మరో పోటీదారుతో పంచుకోవడం తనకు ఇబ్బందిగా ఉంటుందని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.
చర్చలోకి అరిష్ఫా ఖాన్
వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఇతర హౌస్‌మేట్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా తనను తాను లెజెండ్‌గా పేర్కొంటూ సింగిల్ బెడ్ ఎందుకు కావాలో మేరీ వివరించినట్లు సమాచారం. అందరికీ సమానంగా వ్యవహరించాల్సిందేనని అరిష్ఫా ఖాన్ స్పందించారు. ఈ చర్చ ప్రీమియర్ ఎపిసోడ్‌లో ప్రధాన అంశంగా మారింది.
‘నువ్వు నా శత్రువు’
చివరకు ఖాజీ సింగిల్ బెడ్‌ను వదులుకోలేదు. దీంతో మేరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్తూ.. ‘నాకు నువ్వంటే ఇష్టం లేదు.. నువ్వు నా శత్రువు’ అని ఖాజీతో చెప్పినట్లు సమాచారం. సరదాగా సాగిన ఈ వాగ్వాదం తొలి ఎపిసోడ్‌లో మరింత ఆసక్తిని పెంచింది.
తొలి రోజే మొదలైన రచ్చ
బిగ్‌బాస్ ఇంట్లో క్రమశిక్షణ, పోటీ తత్వాన్ని తీసుకురావాలని మేరీ గతంలో చెప్పిన నేపథ్యంలో తొలి రోజే జరిగిన ఈ ఘటన ఆసక్తి రేపుతోంది. సెప్టెంబరు 6, 2026న ప్రారంభమైన బిగ్‌బాస్ 20లో మేరీ కోమ్, ఖాజీ తౌకీర్, అమ్రపాలి దూబే, మహి విజ్, అరిష్ఫా ఖాన్, ఆసిఫ్ ఖాన్, కనికా మాన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ బెడ్ వివాదం శాశ్వత వైరంగా మారుతుందా? లేక సీజన్ ఆరంభంలో చోటుచేసుకున్న ఓ గుర్తుండిపోయే ఘటనగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.
ఇది కూడా చదవండి: పేరులో తేడా.. పద్మశ్రీకి గ్రహీతకూ ‘సర్’ నోటీసు!


