బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో విద్యను అందించేందుకు కృషి చేసిన పద్మశ్రీ పురస్కార గ్రహీత హరేకళ హజబ్బాకు ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా నోటీసు జారీ చేసింది. 2002లో ఓటర్ల జాబితా సవరణ సమయంలో ఆయన పేరు ‘హజబ్బా’గా నమోదైనట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఆయన రేషన్ కార్డు, ఆధార్, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డుల్లో పేరు ‘హరేకళ హజబ్బా’గా ఉంది.
‘సర్’ జాబితాల్లో పేర్ల తొలగింపునకు సంబంధించి నోటీసులు అందుకున్న ప్రముఖుల జాబితాలో హజబ్బా కూడా చేరారు. నటుడు ప్రకాశ్ రాజ్, ఆర్థికవేత్త అమర్త్యసేన్, క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, నటుడు దేవ్ (దీపక్ అధికారి), కవి జాయ్ గోస్వామి తదితరుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. హజబ్బా అదే ఓటరా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు బూత్ స్థాయి అధికారి ద్వారా ఎన్నికల సంఘం నోటీసు అందించింది. సెప్టెంబర్ 11న ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఆయనను ఆదేశించినట్లు తెలిసింది. అయితే విషయం అధికారుల దృష్టికి వచ్చిన తర్వాత, సహాయ ఎన్నికల నమోదు అధికారి.. గ్రామ సహాయకుడిని 70 ఏళ్ల హజబ్బా ఇంటికి పంపి, అవసరమైన సవరణలు చేయించినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.
మంగళూరు నగరంలో హజబ్బా నారింజ పండ్లు విక్రయించేవారు. తద్వారా సంపాదించిన డబ్బును పొదుపు చేసి, 2000లో తన స్వగ్రామమైన హరేకళలో ప్రాథమిక పాఠశాలను నిర్మించేందుకు సహకరించారు. 2020లో ఆయనకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించింది. అత్యంత సాధారణ ఆర్థిక పరిస్థితులున్న ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన చిన్న వయసులోనే చదువు మానేసి, కుటుంబ పోషణ కోసం పనిచేశారు. అయితే తన గ్రామం న్యూపడపులో పాఠశాల నిర్మించాలని సంకల్పించారు. ఆ పాఠశాలను ‘హజబ్బా స్కూల్’గా పిలుస్తారు. ఆయనను ప్రజలు ‘అక్షర సంత’గా ఆప్యాయంగా పిలుచుకుంటారు.
ఇది కూడా చదవండి: శిథిలాల నుంచి ఆస్పత్రి వరకు.. మేనమామ రోదన!


