breaking news
Hajabba
-
పేదోడికి పెద్ద బహుమతి
చదువుకోలేదు కానీ వందల మందికి విద్యను అందిస్తున్నాడు. ఆస్తులు లేవు కానీ ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నాడు. పండ్లను విక్రయిస్తూ వచ్చిన డబ్బును పేద పిల్లల చదువుకు ధారపోస్తున్నాడు. సాయం చేయాలంటే ధనవంతులే అయి ఉండక్కర్లేదని, పెద్ద మనసు ఉంటే చాలని నిరూపించాడు కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బా. పండ్లను విక్రయిస్తూ గడిచిన 20 ఏళ్లుగా వందల మంది పేద విద్యార్థులను చదివిస్తున్నాడు. ఈ పేదోడి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారత నాల్గవ అత్యున్నత పురస్కారం ‘ పద్మ శ్రీ’ ప్రకటించింది. విద్యారంగంలో అతను చేస్తున్న అసమాన సేవకు గాను ఈ అవార్డు లభిచింది. ‘అక్షర శాంత’గా ప్రసిద్ధిగాంచిన హజబ్బా గురించి తెలుసుకుందాం. (చదవండి : జైట్లీ, సుష్మాకు విభూషణ్) పేదవాడే కానీ.. దక్షిణ కర్ణాటకలోని కోణాజీ సమీపంలో ఉన్న హరెకళ న్యూపడ్పు గ్రామానికి చెందిన హజబ్బా నిరక్షరాస్యుడు,పేదవాడు. బత్తాయి పండ్లను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పండ్లను విక్రయిస్తే వచ్చిన డబ్బులతో తన సొంత గ్రామంలోని పేద పిల్లలను చదిస్తున్నారు. తనలాగా ఎవరూ నిరక్షరాస్యులు కారాదని సంకల్పించి గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. దాని నిర్మాణం కోసం ఐదువేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇతర దాతలు, ప్రభుత్వం సహాయంతో స్థలంలో ఆ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1999లో నిర్మించిన ఆ పాఠశాలలో వందలాది పేదవిద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అదే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలగా మారింది. ఆ ఆలోచన పుట్టిందిలా.. ‘గతంలో ఓ విదేశీ జంట నా దగ్గరకు వచ్చి పండ్ల ధర ఎంత అని ఆంగ్ల భాషలో అడిగింది. నాకు తుళు,బెరీ భాష తప్ప వేరేది రాదు. వారు ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేకపోయా. దీంతో విసుగు చెందిన ఆ జంట అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. ‘నేను చదువుకొని ఉండి ఉంటే ఇలా జరిగేదా అనుకున్నాను. చదువుకోలేకపోవడం వల్లే నాకు వారి భాష అర్థం కాలేదు. నాలాగా ఎవరూ బాధపడొద్దని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచే పేద పిల్లలకు చదువు కోసం సహాయం చేశాను. మా గ్రామంలోని పేద పిల్లలందరు ఇప్పుడు చదువుకుంటున్నారు. మా గ్రామంలో ఓ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఓ జాతీయ మీడియాతో హజబ్బా అన్నారు. (చదవండి : బ్రెజిల్ పద్మశ్రీలు) నమ్మలేకపోయాడు పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయం అధికారులు చెప్పే వరకు నాకు తెలియదు. రేషన్ బియ్యం తీసుకునేందుకు షాపు ముందు క్యూలో నిలుచున్న నా దగ్గరకు అధికారులు వచ్చి ఈ అవార్డు వచ్చిందని తెలిపారు. దీంతో ఇది కలా, నిజమా అని నమ్మలేకపోయా’ అని హజబ్బా అన్నారు. ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలు ఎంతో మంది పేద పిల్లలకు చదువును అందిస్తున్న హజబ్బాను మంగళూరు వాసులు ముద్దుగా ‘అక్షర శాంత’ గా పిలుచుకుంటారు. ఆయన జీవిత విశేషాలను మంగళూరు యూనివర్సీటీలో సిలబస్‌గా పెట్టారు. కేరళలోని కర్ణాటక మీడియం పాఠశాలలలో ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు. 2009లో సీఎన్ఎన్ ఏబీఎన్ ‘రియల్ హీరోస్’ అవార్డును పొందారు. ఈ అవార్డు కింద వచ్చిన 5లక్షల రూపాయలతో పాఠశాల కోసం స్థలాన్ని కొన్నారు. తన పేదరికం గురించి ఆలోచించకుండా పేదపిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్న హజబ్బాపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అవేమీ పట్టించుకోడు హజబ్బా. తన పని తాను చేసుకుపోతారు. -
నవ్విన వారిముందే రియల్ హీరో అయ్యాడు!
ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా నిరాశ పడలేదు హజబ్బా. వెనక్కి తగ్గలేదు. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విదేశీ పర్యాటకులు ఒకటికి రెండు సార్లు అడిగినా హజబ్బా దగ్గర జవాబు లేదు. అతనికి అవమానంగా, బాధగా అనిపించింది. ‘‘నేను చదువుకొని ఉండి ఉంటే ఇలా జరిగేదా?’’ అనుకున్నాడు మనసులో. మంగుళూరు(కర్నాటక)కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప్డు గ్రామంలో కమలాఫలాలు అమ్ముతాడు హజబ్బా. ఒకరోజు ఆ ఊరికి వచ్చిన విదేశీ పర్యాటకులు కమలా ఫలాల ధర గురించి హజబ్బాను అడిగారు. వారు దేని గురించి అడుగుతున్నారో హజబ్బాకు అర్థం కాలేదు. కాస్త అవమానంగా కూడా అనిపించింది. ఈలోపు ఎవరో వచ్చి- ‘‘ఈ పండ్ల ధరల గురించి అడుగు తున్నారు’’ అని చెప్పారు. ఈ సంఘటన హజబ్బాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ‘పేదరికం కారణంగా నేను చదువుకోలేకపోయాను. కాస్తో కూస్తో చదువుకొని ఉంటే వాళ్లు మాట్లాడింది అర్థం చేసుకునేవాడిని కదా. నాలాంటి పరిస్థితి పేద పిల్లలెవరికీ రాకూడదు. వారి కోసం ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు. దానికోసం... ‘ఎలాగైనా సరే... నా ఊళ్లోని పేద పిల్లల కోసం ఒక బడి కట్టిస్తాను’ అనుకున్నాడు బలంగా. ఏ మంచి పనీ అవరోధాలు లేకుండా పూర్తి అవ్వదు అంటారు. హజబ్బాకి కూడా అలాంటి అవరోధాలే ఎదురయ్యాయి. పేద పిల్లల కోసం స్కూలు కట్టాలన్న అతని ఆలోచన విని కొందరు వెటకారంగా నవ్వారు. కొందరు ‘స్కూలు కట్టడం అంటే అంత తేలికను కున్నావా?’ అని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. హజబ్బా భార్య మైమూన కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘ముందు మన ముగ్గురు పిల్లల భవిష్యత్ గురించి ఆలో చించండి’’ అంది. అయితే భర్తలోని పట్టు దల, నిజాయితీ చూసి మనసు మార్చు కుంది. భర్తకు అండగా నిలబడింది. అయితే ఎవరి అండనూ కోరుకోలేదు హజబ్బా. అతని లక్ష్యం పట్ల అతనికి స్పష్టత ఉంది. అందుకే సాధన మొదలు పెట్టాడు. మొదట స్కూలు కోసం కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే స్కూలు కట్టించడానికి తాను పొదుపు చేసిన డబ్బు సరిపోదని అర్థమైంది. దాంతో గడపా గడపా తిరుగుతూ తోచిన సహాయం చేయమని కోరేవాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఓసారి సహాయం కోసం ఒక సంపన్నుడి ఇంటికి వెళ్తే... ఒక్క పైసా సహాయం చేయకపోగా తన ఇంట్లో ఉన్న కుక్కను హజబ్బా మీదికి వదిలాడు. ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా, అదిలించినా, కోపగించుకున్నా నిరాశ పడలేదు హజబ్బా. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విషయం పదిమంది దృష్టిలో పడింది. స్థానిక దినపత్రికలో హజబ్బా మీద స్ఫూర్తిదాయక కథనం వచ్చింది. ఒక జాతీయ చానల్ వాళ్లు ‘రియల్ హీరోస్’ అవార్డును ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన అయిదు లక్షల్ని కూడా స్కూలు కోసమే వెచ్చించాడు హజబ్బా. దీంతో మొదట నవ్విన వాళ్లందరికీ అతడి నిజాయితీ అందరికీ అర్థమైంది. హజబ్బా నిర్మించిన స్కూలు ఇప్పుడు సెకెండరీ స్కూల్‌గా మారింది. ‘‘స్కూలు కట్టించడం వరకే నా పని’’ అంటూ ఆ స్కూలును ప్రభుత్వపరం చేశాడు హజబ్బా. స్కూలుకు తన పేరు పెట్టాలనే ప్రతిపాదనను కూడా తిరస్క రించాడు. దాంతో అతడి ఔన్నత్యం మరింత వెలుగులోనికి వచ్చింది. అతడికి అభిమానులు ఏర్పడ్డారు. అరకొర సౌకర్యా లున్న ఇంట్లో నివసిస్తూ అనారోగ్యానికి గురవుతున్న హజబ్బాకు వాళ్లంతా మంచి ఇల్లు కట్టించారు. తన పేదరికం గురించి ఆలోచించకుండా పేదపిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్న హజబ్బాపై జిల్లా, రాష్ర్ట స్థాయిలోనే కాదు జాతీయంగా కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అవేమీ పట్టించుకోడు హజబ్బా. తన పని తాను చేసుకు పోతాడు. ప్రస్తుతం గ్రామంలో ప్రి-యూనివర్శిటీ నిర్మాణ పనుల్లో తలమునకలవుతున్నాడు.