సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి.సుదర్శన్ రెడ్డికి కూడా ‘సర్’ నోటీసులు వచ్చాయి. నేమ్ అనమాలీస్ కింద అధికారులు నోటీసులు ఇచ్చారు. 2002- 2026కు ఇంటి పేరు సరిపోలలేదు. నోటీసులను అందుకున్న సీఈవో సుదర్శన్.. ఎన్నికల అధికారులకు వివరాలు ఇవ్వనున్నారు.
ఇప్పటికే దాదాపు 93 లక్షల మంది నోటీసులు అందుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులు కొత్త ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాన్ని అన్ని వివరాలతో భర్తీ చేసినా నోటీసులు రావడంతో చాలామంది అయోమయానికి గురవుతున్నారు.
నో మ్యాపింగ్, అనామలిస్ కారణంగా హైదరాబాద్‌లో ఈ కేటగిరీల్లోని వారు దాదాపు 12.55 లక్షల మంది ఓటర్లున్నారు. వీరందరికీ ఇప్పటికే నోటీసులు అందాలి. కానీ.. దాదాపు లక్ష మందికి మాత్రమే అందాయి. ఓటరు పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు లేదా చిరునామాలో చిన్నపాటి తప్పులున్నా, ఒక్క అక్షర దోషమున్నా, అధికారుల ముందు విచారణకు నిర్ణీత తేదీన హాజరు కావాలనడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతమాత్రం దానికి కొత్తగా నమోదు చేసుకుంటే సరిపోతుందిగా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


