నన్ను మంత్రి పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్‌కే నష్టం : కొండా సురేఖ | Konda Surekha holds a press conference regarding her removal from the cabinet | Sakshi
Sakshi News home page

నన్ను మంత్రి పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్‌కే నష్టం : కొండా సురేఖ

Sep 3 2026 4:19 PM | Updated on Sep 3 2026 5:22 PM

Konda Surekha holds a press conference regarding her removal from the cabinet

సాక్షి,హైదరాబాద్‌: తన మీద కుట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయని కొండా సురేఖ ఆరోపించారు. ఉరితీసే ఖైదీని కూడా మీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు?. కానీ కనీసం అలా నన్ను అడగకుండా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వర్గం నుంచి తనని బర్తరఫ్‌ చేయడంపై కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. 

‘సంతకం లేని ఒక ఫేక్ లెటర్ సర్క్యూలేట్ అవుతుంది. నన్ను బర్తరఫ్ చేస్తున్నట్లు , చిన్నారెడ్డిని తొలగించినట్లు అడ్రస్ లేని లెటర్ బయటకొచ్చింది. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషం. నన్ను తొలగిస్తున్నామని ఒక మాట అడగాల్సి ఉండేది. అడిగి ఉంటే..ఎందుకు అనే ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కేది.

నా అభిప్రాయం తీసుకోకుండా తొలగించారు. నన్ను తొలగించడం ఏఐసీసీకి ఇష్టం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి పట్టుబట్టి తొలగించారు. మీరు తొలగిస్తారా.. నన్ను వెళ్లమంటారా అని సీఎం బెదిరించారు. మా మాజీ ఓఎస్‌డీ  సుమంత్ కుటుంబాన్ని బెదిరించారు. మా ప్రభుత్వంలో మా మనిషిని ఇబ్బంది పెట్టడం అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు కాదా. 

ఇకనైనా ప్రభుత్వం సుమంత్‌ను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నా. మల్లు రవి గతంలో కాంగ్రెస్‌ను తిట్టలేదా.. రోశయ్య  ఇంధిరా గాంధీని తిట్టలేదా.  జైపాల్ రెడ్డి, ఇంధిరా గాంధీని దూషించలేదా. అలాంటి వారిపై చర్యలు తీసుకోలేదు.. కానీ నా కూతురు చేసిన వాఖ్యలకు నన్ను భాధ్యురాలిని చేస్తారా.. నా మంత్రి పదవి పోయినందుకు నాకు ఎటువంటి బాధలేదు.

మా కాళ్ళు మొక్కి మమ్మల్ని గెలిపించాలని అడిగిన వారు.. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారా? మాకు ప్రజాబలం ఉంది.. మమ్మల్ని ఏం చేయలేరు. మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే.. అది లేనంత మాత్రానా మాకు నష్టం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. ఈ రోజు నాకు వచ్చింది.. రేపు మీకు వస్తుంది. బయటకు వచ్చి మాట్లాడండి. ఈ ప్రభుత్వంలో పనులు అవ్వడం లేదు. పిటీషన్‌లు తీసుకోవడం తప్ప.. మేము చేసిందేమీ లేదు. సర్వేలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

నన్ను తొలగించిన నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలని నేను అడగను. యాదాద్రి టెంపుల్ కమిటీ విషయం నిర్ణయం అందరితో చర్చించలేదు. నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. నా కూతురు గౌరవం కోసమే.. ఆమె వాఖ్యలపై నేను స్పందించలేదు. నేను తప్పు చేయలేదు..నాకు అవమానం ఎందుకు. ప్రజలతో,నేతలతో  వెఎస్సార్ మమేకమైనట్లు సీఎం రేవంత్‌రెడ్డి లేరు’ అని వ్యాఖ్యానించారు. 

👉ఇదీ చదవండి: మీసం మెలేసిన కొండా మురళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement