సీఎం రేవంత్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు | Konda Surekha Slams Revanth Govt Over Abrupt Dismissal | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Sep 3 2026 3:15 PM | Updated on Sep 3 2026 4:01 PM

Konda Surekha Slams Revanth Govt Over Abrupt Dismissal

సాక్షి, హైదరాబాద్‌: మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయం చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి నన్ను తొలగించే ఆలోచన లేదు. నన్ను బర్తరఫ్‌ చేయకపోతే తాను వెళ్లిపోతానని రేవంత్ బెదిరించడంతోనే నన్ను తొలగించారు’అని ఆమె ఆరోపించారు.

ఈ సందర్భంగా కేబినెట్ నుంచి తన బర్తరఫ్‌ చెల్లదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కనీసం తన నుంచి ఎలాంటి వివరణ కోరకుండా, అడిగి తెలుసుకోకుండా మంత్రి పదవి నుంచి ఎలా తొలగిస్తారని కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న బర్తరఫ్ సర్క్యులర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి గానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గానీ సంతకాలు చేయలేదని, ఆమోదముద్ర లేని ఆ పత్రానికి ఎలాంటి చెల్లుబాటు ఉండదని తేల్చిచెప్పారు.

తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె నిలదీశారు. ఇతర నాయకుల కుటుంబాలను ఉదహరిస్తూ.. ‘పదేళ్లుగా నా కూతురు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తోంది. సుస్మిత టికెట్ అడిగితే తప్పేంటి? కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీని చేయలేదా? ఎంపీ అరవింద్ బీజేపీలో ఉంటే, ఆయన సోదరుడు సంజయ్ కాంగ్రెస్‌లో కొనసాగడం లేదా?’అని ప్రశ్నించారు.

కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను తనకు ముడిపెడుతూ కేబినెట్ నుంచి తొలగించాలనే నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాల నేపథ్యంలో తన భవిష్యత్తుపై భర్త కొండా మురళితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

👉ఇదీ చదవండి: మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ ఔట్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement