సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. చిన్నారెడ్డిపైనా వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా చిన్నారెడ్డిని తొలగించింది. ఈ మేరకు జీవో 1287 ద్వారా ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించింది. ఆమె నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వనపర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠకు తెరపడింది. 2023 ఎన్నికల సమయంలో మేఘారెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు రావడం.. తొలుత చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్, ఆ తర్వాత మేఘారెడ్డికి ఇవ్వడం ఇరువురి మధ్య విభేదాలకు దారితీసింది.
అయితే చిన్నారెడ్డి గోపాల్‌పేట వేదిక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సీరియస్‌గా పరిగణించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయనపై భగ్గుమన్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గాంధీభవన్, టీపీసీసీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సైతం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సిఫార్సు చేయగా.. చిన్నారెడ్డిపై కాంగ్రెస్ హై కమాండ్ చర్యలు తీసుకుంది.


