సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయ్యారు. ఈ మేరకు ఆమెను తక్షణమే తొలగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ బర్తరఫ్‌కు సంబంధించిన అధికారిక సిఫార్సును ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌కు పంపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
దీనితో పాటు పలు కీలక నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వం మార్పులు, నియామకాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ నిర్ణయించారు. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం నూతన ఉపాధ్యక్షురాలిగా నియమించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరేళ్ల శారదను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. అలాగే, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ బర్తరఫ్‌కు ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు. కొండా సురేఖ వ్యవహార శైలిపై పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పదే పదే పార్టీ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదనే కఠినమైన సంకేతాలు శ్రేణులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఢిల్లీలో పార్టీ పెద్దలతో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం రేవంత్ హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. మొత్తం మీద అధిష్టానం కఠిన చర్యలతో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

👉ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ తిరుగుబాటు


