సాక్షి,న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తన కుమార్తె కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై అధిష్టానం ముందు తన ఆవేదనను వెలిబుచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌లతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై తిరుగుబాటు ప్రకటించేలా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ మహిళలు స్వతంత్రంగా బ్రతకాలని నిత్యం చెబుతుంటారు. నా కూతురు స్వతంత్రంగా మాట్లాడిన దానికి నన్ను బాధ్యురాలిని చేస్తూ నాకే షోకాజ్ నోటీసులు ఇస్తారా?.ఖర్గేకు పరిస్థితిని వివరిస్తూ లేఖ అందించాను. ఆ లేఖలోని విషయాలు బయటకు వస్తే పార్టీలో తీవ్ర ప్రకంపనలు రావడం ఖాయం.
నా కుమార్తె సుష్మితా పటేల్ మాట్లాడింది తప్పా? ఒప్పా? అనేది నేను చెప్పను. నా బిడ్డ స్వతంత్ర ఆలోచనలతో మాట్లాడింది, తనను వారించే అధికారం నాకు లేదు. నా పొలిటికల్ లైఫ్ నాది. నా వైపు ఎలాంటి తప్పు లేదనే విషయాన్ని అధిష్టానానికి స్పష్టంగా వివరించా
నాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని, మంత్రి పదవిలో కొనసాగేలా చూడాలని అధిష్టానాన్ని కోరా. భేటీలో తన బర్తరఫ్ గురించి ఎలాంటి చర్చా రాలేదు. నాపై కుట్ర జరుగుతోందని ఆరోపించిన సురేఖ.. నాకు నోటీసులు ఇచ్చిన పార్టీ, నాపై బహిరంగంగా విమర్శలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. వారి వెనుక ఉండి నన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడించిన అసలు సూత్రధారులపై కూడా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసి, అధిష్టానం స్పందన ఆధారంగానే తన తదుపరి కార్యాచరణ ఉంటుందని కొండా సురేఖ తేల్చిచెప్పారు.


