సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుగుబాటు చేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ సైతం కట్టారు కొండా సురేఖ. దీంతో ఆమె ఇష్యూ కాస్త చల్లబడేలా ఉందని కొందరు భావించారు. అయితే, కొండా సురేఖ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. న్యూఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ తాను మల్లికార్జున ఖర్గేను కలిసి, తన వివరణ ఇచ్చానని తెలిపిన విషయం తెలిసిందే. సవివరమైన లేఖను ఖర్గేకు అందజేశానని ఆమె అన్నారు. ఆ లేఖ బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని కొండా సురేఖ అనడం గమనార్హం.
రాజీనామా చేయాలంటే.. తాను చేయబోనని చెప్పారు. తన కూతురు ఎమ్మెల్యే కావాలనుకుకుంటున్నారని తెలిపారు. కడియం శ్రీహరి తన కూతురును ఎంపీని చేసుకున్నారని చెప్పారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని అన్నారు. పొంగులేటి, భట్టి విక్రమార్క కమీషన్లపైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని, దానిపైన ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని ఆమె నిలదీశారు.
లేఖలో ఏముంది?
మల్లికార్జున ఖర్గేను కలిసి, లేఖను ఖర్గేకు అందజేశానని.. అది బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని చెబుతూ కొండా సురేఖ మరో బాంబు పేల్చారు. దీంతో ఆ లేఖలో ఏముందన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే ఆమె ఆ లేఖను బయటపెడతారా? అసలు ఆ లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు? ఎవరిని ఉద్దేశించి రాశారు? అందులో ఎలాంటి కీలక విషయాలు ఉన్నాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో లేఖలోని అంశాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే లేఖలోని పూర్తి వివరాలు ఇప్పటివరకు బహిరంగం కాలేదు. ఖర్గేకు లేఖ అందజేసినట్లు ఆమె స్వయంగా చెప్పడంతో, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన కీలక అంశాలు అందులో ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేఖ బయటకు వస్తుందా? అందులోని విషయాలు ఏమిటన్నది తెలియాలంటే మరింత స్పష్టత రావాల్సి ఉంది. లేఖ గురించి చెప్పే సమయంలో ఆమె భట్టి విక్రమార్క, పొంగులేటి కమీషన్లపై ఎందుకు చర్యల్లేవు?’’ అంటూ కూడా ప్రశ్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇదీ చదవండి: బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు?


