ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆమె భేటీ కానున్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా అధిష్ఠాన పెద్దలతో సమావేశమవుతున్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి.. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సుమారు గంటన్నరపాటు సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీలో కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ క్రమశిక్షణ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పెండింగ్‌లో ఉన్న రెండు మంత్రి పదవులు, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులు కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలా? లేక శాఖ మార్పుతో సరిపెట్టాలా? అనే అంశంపై అధిష్ఠానం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సురేఖకు కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఆమెపై తుది నిర్ణయం తీసుకునే ముందు సురేఖతో సంప్రదింపులు జరపాలని కొందరు నేతలు అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. శాఖను మార్చడం వంటి ప్రత్యామ్నాయాన్ని కూడా కొందరు నేతలు సూచించినట్లు సమాచారం.
ఇక మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌తో కేసీ వేణుగోపాల్ సమావేశం కూడా కీలకంగా మారింది. సురేఖ వ్యవహారంపై వారి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఖర్గే నేతృత్వంలో మరో కీలక భేటీ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా.. కొండా సురేఖపై చర్య విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠగా మారింది.
ఇదీ చదవండి: ప్రజలను కాంగ్రెస్ నట్టేటముంచింది: కేటీఆర్


