హైదరాబాద్: వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్‌ను నియమించడంలో తాత్సారం జరుగుతుంది. వారం రోజులు గడుస్తోన్నా ఇన్‌స్పెక్టర్ నియామకంలో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏ అధికారి వచ్చినా 10 వారాలు కూడా ఉండకుండా సస్పెన్షన్లకు గురవుతుండడంతో ఈసారి ఎస్‌హెచ్‌వో నియామకంలో మరింత పారదర్శకత ఉండేలా చేపట్టాలని యోచిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసముండే పరిధి ఠాణాలోనే వరుస వివాదాలు చోటుచేసుకుంటుండడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నివాసంతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయ కిందికి వచ్చే ఈ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్లు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తుండడంతో పాటు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చారు. దీంతో ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేసి, ఆయన స్థానంలో ముత్తుయాదవ్‌ను నియమించారు. ఆయన కూడా విధి నిర్వహణలో తీవ్ర నిరక్ష్యాన్ని కనబరచడమే కాకుండా మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై చర్యలు తీసుకోవడంలోనూ, ఆయనను అరెస్టు చేయడంలోనూ అశ్రద్ధ వహించారు. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులు పారిపోవడానికి ఆస్కారం కలిగించారనే ఆరోపణలతో గత నెల 25న ముత్తుయాదవ్‌పై వేటుపడింది. అప్పటి నుంచి ఇక్కడ ఇన్‌స్పెక్టర్‌ను నియమించడానికి ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
జల్లెడపడుతున్న నిఘా వర్గాలు
సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉండే ఈ ఠాణాకు సమర్ధుడైన ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని, ఆ స్థాయి అధికారి కోసం నిఘా వర్గాలు జల్లెడపడుతున్నాయి. అటు ఇంటెలిజెన్స్, ఇటు ఎస్‌బీ ఈ ఠాణాకు ఇన్‌స్పెక్టర్‌ను నియమించడంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఇన్‌స్పెక్టర్ నియామకంలో పాత్ర ఉండే అధికారులను పక్కనబెట్టి ఈసారి గుర్తించిన ఉన్నతాధికారుల ప్రమేయంతో ఈ పోస్టును భర్తీ చేయాలని యోచిస్తున్నారు. అందుకే నియామకంలో ఆలస్యం జరుగుతుందని పేర్కొంటున్నారు.
దగ్గరపడుతున్న వినాయక చవితి వేడుకలు
వినాయక చవితి వేడుకలు దగ్గర పడుతుండడంతో జూబ్లీహిల్స్ ఠాణాకు ఇంకా ఇన్‌స్పెక్టర్‌ను నియమించకపోవడంతో వినాయక మండపాల కమిటీ ప్రతినిధుల సమావేశాలు, మైత్రి కమిటీ సమావేశాలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద నిఘాతో పాటు అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడం, రౌడీ షిటర్ల బైండోవర్, నిమజ్జనోత్సవాల్లో జాగ్రత్తలు, నిమజ్జనోత్సవ రూట్లు.. ఇలా ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారికి కీలకమైన బాధ్యతలు ఉంటాయి. ఇన్‌స్పెక్టర్‌ను నియమించకపోవడంతో నవరాత్రులతో పాటు నిమజ్జనోత్సవాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ముందుకుసాగని కేసులు
జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ముఖ్యంగా దొంగతనాల సంఖ్య పెరుగుతుంది. కేసుల ఛేదనలో పోలీసులు ముందుకువెళ్లలేకపోతున్నారు. దీనికి ఆదేశాలు ఇచ్చి తగిన సూచనలు ఇచ్చే అధికారి లేకపోవడంతో నేరాల మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. పూర్తిస్థాయి జూబ్లీహిల్స్ లేకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు చేయడంలోనూ, బాధితులకు న్యాయం చేయడంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పరిశీలనలో ముగ్గురు
జూబ్లీహిల్స్ ఠాణాకు ఈ సారి సమర్థుడైన ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని తలపెట్టడంతో బాధ్యత గల అధికారుల కోసం చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరినైనా ఒకరిని నియమిచే బాధ్యత ఈసారి సీఎంవో కార్యాలయంపై పడిందని తెలుస్తోంది.
‘సిట్’ బృందాలతో..
ఈ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ ఏర్పాటుచేశారు. ఇందుకోసం ఇక్కడ ఏసీపీ కొంతకాలంగా సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్నారు. దీంతో ఇన్‌చార్జి ఏసీపీగా సామల వెంకట్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. మరోవైపు జూబ్లీ రిచ్‌కిడ్ ట్రాప్ కేసులోనూ సిట్ ఏర్పాటుచేశారు. దీనికి కూడా ఒక ఎస్సైతో పాటు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇలా సిట్ రూపంలో ఇప్పటికే ఠాణాపై బరువు పెరిగిపోయింది. బాధ్యత గల అధికారులంతా ఈ దర్యాప్తులోనే ఉన్నారు. ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ కూడా లేకపోవడంతో దీని ప్రభావం కేసులపై పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది.


