అల్లుడు నువ్వు అడిగినంత ఇచ్చాం..అయినా! | Newlywed Bride Ends Life In Wanaparthy District | Sakshi
Sakshi News home page

అల్లుడు నువ్వు అడిగినంత ఇచ్చాం..అయినా!

Sep 2 2026 1:13 PM | Updated on Sep 2 2026 1:53 PM

Newlywed Bride Ends Life In Wanaparthy District

పెళ్లితో ఒక్కటైన జీవితాలు.. పరస్పర అవగాహన, నమ్మకం, సహనంతో సాగాల్సిన కాపురాలు కలహాలతో కకావికలమయ్యాయి. చిన్నచిన్న విభేదాలు పెద్ద గొడవలకు దారితీయడంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేర్వేరు ఘటనల్లో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలతో ఇద్దరు భర్తలు మృతి చెందగా.. అదనపు కట్నం కోసం జరిగిన వేధింపులు భరించలేక ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ మూడు ఘటనలూ వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోనే చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కుటుంబసమస్యలను పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాల్సిన చోట క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. ఆయా కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చాయి.  --- వనపర్తి జిల్లా         


ఉషారాణి 

అదనపు కట్నం వేధింపులు భరించలేక..   
కనిమెట్ట గ్రామానికి చెందిన ఉషారాణి (20) అదనపు కట్నం వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరో విషాదాన్ని మిగిల్చింది. ఉషారాణికి మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన మల్లేష్‌ తో ఈ ఏడాది జూన్‌ 25న వివాహమైంది. వివాహ సమయంలో ఆరు తులాల బంగారం, రూ.2 లక్షల నగదు కట్నంగా ఇచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలం సజావుగా సాగిన దాంపత్యంలో.. నెల రోజులుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఉషారాణి తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. 

ఈ విషయమై తల్లిదండ్రులు అల్లుడికి సర్దిచెప్పినప్పటికీ వేధింపులు కొనసాగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఉషారాణి మంగళవారం ఉదయం నాగారం నుంచి కనిమెట్టలోని పుట్టింటికి వచ్చి.. మధ్యాహ్నం చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు భర్త మల్లేష్‌ అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.విక్రమ్‌ తెలిపారు.

వివాదంతో యువకుడి మృతి 
కొత్తకోట మండలంలోని పాలెం గ్రామానికి చెందిన గుండె నవీన్‌కుమార్‌(26) గత కొంతకాలంగా కొత్తకోట పట్టణంలోని బీపీఆర్‌ గార్డెన్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ, భార్య గౌత మి, కుమారుడితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇటీవల గ్రామంలో నూతన ఇంటి నిర్మా ణం కొరకు అప్పులు చేయడంతో పాటు భార్యాభర్తల మధ్య  తరచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి దంపతుల మధ్య మరోసారి వివాదం జరగడంతో భార్య గౌతమి తన సోదరుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. 

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్‌ సోమవారం అర్ధరాత్రి తాను పనిచేస్తున్న గార్డెన్స్‌లో ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. వారు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తండ్రి గుండె ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆచూకీ కోసం గాలిస్తే.. కాల్వలో మృతదేహం 
మరో ఘటనలో భార్యాభర్తల మధ్య విభేదాల తో ఇంటి నుంచి వెళ్లిపోయిన రాములు కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  నాగర్‌కర్నూల్‌ జిల్లా బాజాపురానికి చెందిన రాములు (35) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో కొత్తకోట మండలం రాణిపేటలో పెరిగాడు. 15 ఏళ్ల క్రితం అడ్డాకుల మండలానికి చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గొర్రెల కాపరిగా జీవనం సాగించే రాములు ఇటీవల కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెళ్లి.. సుమారు 20 రోజుల క్రితం రాణిపేటకు తిరిగొచ్చాడు. 

ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆగస్టు 29న ఇంటి నుంచి వెళ్లిపోయిన రాములు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు పలుచోట్ల గాలించారు. గ్రామ శివారులోని రంగసముద్రం కాల్వ సమీపంలో మంగళవారం ఆయన చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అధికారుల సహకారంతో గాలింపు చేపట్టగా ముమ్మళ్లపల్లి శివారులో రాములు మృతదేహం లభ్యమైంది. భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.విక్రమ్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement