జైపూర్: నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పులి మహిళా కార్మికురాలిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో పార్క్‌లో సమీప గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పార్క్‌లోని 16వ ఎన్‌క్లోజర్‌లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఏడుగురు మహిళలు గడ్డి కోస్తుండగా.. అకస్మాత్తుగా పులి.. మహిళపై దాడి చేసింది. మృతురాలిని సుగ్నా దేవిగా గుర్తించారు. మిగతా మహిళలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. కొందరు ఫెన్సింగ్ ఎక్కగా.. మరికొందరు సమీపంలోని చెట్లపైకి ఎక్కి తప్పించుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మహిళలు మంగళవారం ఎన్‌క్లోజర్‌లోకి గడ్డి కోయడానికి వెళ్లారు. బుధవారం ఉదయం మళ్లీ గడ్డి సేకరించేందుకు అక్కడికి వెళ్లారు. మహిళలు లోపల ఉన్న విషయం తెలియక హన్సా అనే ఉద్యోగి ఎన్‌క్లోజర్‌ను తెరిచినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు ఉండటంతో అటవీ శాఖ అధికారులను వెంటనే సంప్రదించలేకపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. పులిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఫెన్సింగ్‌పై, చెట్లపై చిక్కుకుపోయిన మహిళలను కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఘటనపై స్థానికులు నిరసనకు దిగడంతో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (DCF) ఆశిష్ వ్యాస్, పోలీసు అధికారి పీయూష్, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ శర్మ వారితో సమావేశమయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరుతామని.. కాగా, ఆమె పిల్లల్లో ఒకరికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూ కేర్‌టేకర్ ఉద్యోగం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేశారు.


