కనుచూపుమేర భీకర దృశ్యాలు... బాధితుల ఆర్తనాదాలు... బురద ప్రవాహంలో కొట్టుకుపోతున్న గ్రామాలు... భయంకరంగా విరిగి పడుతున్న కొండచరియలు... ఎటు చూసినా కల్లోలమే! ఇటువంటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ తనప్రాణాలను సైతం పణంగా పెట్టి సహాయక చర్యలు చేపట్టారు నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 100 రెస్క్యూ మిషన్లు పూర్తి చేసి, వందలాది మంది బాధితులను సురక్షితప్రాంతాలకు చేర్చి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ రెస్క్యూ మిషన్‌లో తన అనుభవాల గురించి ఆమె మాటల్లోనే...
2015లో నేపాల్‌లో వచ్చిన భూకంపం కంటే భయంకరమైనది ఈ విపత్తు. నేను గగనతలం నుంచి చూసిన దృశ్యాలు వర్ణనాతీతం. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కలవరపరిచాయి. జలవిద్యుత్‌ప్రాజెక్టులు, ఇళ్లు, రోడ్లు.. ఒక్కటేమిటి సమస్తం కొట్టుకు పోయాయి. 2015లో వచ్చిన భారీ భూకంపం కంటే కూడా ఈ వరదల తీవ్రత చాలా ఎక్కువ. ముఖ్యంగా ఈ విపత్తులో రసువా జిల్లాలోని తిమురే అనే గ్రామం పూర్తిగా దెబ్బతింది. అక్కడి నుంచి బాధితులను సురక్షితప్రాంతాలకు తరలించడం మాకు అతిపెద్ద సవాలుగా మారింది.
ఆపని ఇంజిన్లు
ఈ రెస్క్యూలో రాత్రింబవళ్లు సుమారుగా 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ఒకే ల్యాండింగ్ పాయింట్‌కు ఒకేసారి అనేక హెలికాప్టర్లు రావడం వల్ల ఆపరేషన్ నిర్వహణ మాకు అత్యంత కష్టంగా మారింది. అలా ఇబ్బంది వచ్చినపుడు మేము వైర్‌లెస్ సాధనాల ద్వారా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాము. మరోవైపు నేలపై మోకాలు లోతున ఉన్న చిక్కటి బురద కారణంగా హెలికాప్టర్‌లను నిలపడం మాకు కష్టంగా మారింది. దాంతో ఇంజిన్లను ఆపకుండానే క్షణాల వ్యవధిలో బాధితులను ఎక్కించుకుని సురక్షితప్రాంతాలకు చేర్చాము. ఆర్మీ ఆగస్టా హెలికాప్టర్లతో కలిపి తిమురే గ్రామం నుంచే మొదటి రెండు రోజుల్లో 200 మందికి పైగా బాధితులను రక్షించాం. ఇప్పటికీ అక్కడ చాలామంది ఆచూకీ తెలియడం లేదు.
అలసట మాయం
నాకు సుదీర్ఘ కాలంగా పర్వతప్రాంతాలలో విమానాలు నడిపిన అనుభవం ఉంది. అయినప్పటికీ ఈ భీకర విపత్తు తీవ్రత నాకు సవాల్‌గా నిలిచింది. వరుసగా విమానాలు నడపడం వల్ల మేమంతా తీవ్ర అలసటకు గురయ్యాము, కానీ నేలపై ఆశగా చేతులు ఊపుతున్న బాధితులను చూసినప్పుడు ఆ అలసట అంతా మాయమయ్యేది. వారిని రక్షించడమే మానసికంగా నాకెంతో బలం చేకూర్చింది. వరదల్లో చిక్కుకుని, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ తనవారిగా భావించి రక్షించిన ప్రియా అధికారి సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఎయిర్ హోస్టెస్ టు ఎవరెస్ట్ పైలట్
40 ఏళ్ల ప్రియా అధికారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పట్టా పొందిన ఆమె, మొదట్లో ఎయిర్ హోస్టెస్‌గా తన కెరీర్‌ప్రారంభించారు. కానీ విమాన యానంపై కలిగిన ఆసక్తితో ఫిలిప్పీన్ ్స వెళ్లి పైలట్ శిక్షణలో చేరారు. 2017 నాటికి ఆమె పూర్తిస్థాయి కెప్టెన్ గా మారారు. ఆ తరువాత హిమాలయాలలోని ఎతై ్తనప్రాంతాలలో సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లలో శిక్షణ పొందారు. ఎవరెస్ట్ పర్వతంపై దాదాపు 6,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి గాయపడిన పర్వతారోహకులను రక్షించిన ఘనత ఆమె సొంతం.


