ఢిల్లీ అత్యాచార ఘటన: ఇంటిని విడిచిపెట్టిన బాధిత కుటుంబం! | Noida Delhi Bus Gang-Rape: Minor Survivors Family Flees Village Fearing Stigma and Intrusion | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అత్యాచార ఘటన: ఇంటిని విడిచిపెట్టిన బాధిత కుటుంబం!

Sep 2 2026 1:25 PM | Updated on Sep 2 2026 1:51 PM

Noida Delhi Bus Gang-Rape: Minor Survivors Family Flees Village Fearing Stigma and Intrusion

ఆగ్రా: రాజధాని ఢిల్లీలో ఇటీవల కదులుతున్న బస్సులో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో మీడియా తాకిడి, సామాజిక వివక్షకు భయపడి బాధితురాలి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని తమ గ్రామాన్ని విడిచిపెట్టారు. మైన్‌పురి జిల్లాలోని తమ ఇంటికి తాళం వేసి వారు వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.

బాధిత కుటుంబం గురించి వివరాల కోసం మీడియా ప్రతినిధులు గ్రామానికి రావడం మొదలైనప్పటి నుంచి వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని స్థానికుడు ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా మారామని చెప్పారు. సోమవారం మీడియా ద్వారానే గ్రామంలోని ప్రజలకు ఈ దారుణం గురించి తెలిసిందని మరో పొరుగింటి వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి భవిష్యత్తు, గోప్యతను దృష్టిలో ఉంచుకుని మీడియా ప్రతినిధులు పదేపదే గ్రామానికి రావద్దని, వీడియోలు, ఫొటోలు తీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 4న గ్రేటర్ నోయిడా నుంచి సెక్టార్ 63 వైపు ప్రయాణిస్తుండగా, బస్సు డ్రైవర్, కండక్టర్ కలిసి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించిన బస్సులో ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. అనంతరం పాత ఢిల్లీలోని కశ్మీరీ గేట్ రింగ్ రోడ్డు వద్ద ఆమెను వదిలేసి వెళ్లారు. నిందితులను డ్రైవర్ కులదీప్ (39), కండక్టర్ సందీప్ (26)గా గుర్తించారు. ప్రస్తుతం బాధిత కుటుంబం బంధువుల వద్ద సురక్షితంగా ఉందని స్థానిక ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

గ్రామాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితురాలి ఇంటికి తాళం వేసి ఉందని, తండ్రి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు బబితా చౌహాన్ గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలి వివరాలను వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి:  రాజస్థాన్‌ అంటే జైపూర్‌, ఉదయ్‌పూర్‌ కాదు.. మరి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement