ఢిల్లీలో నిర్భయ-2.. కదులుతున్న బస్సులో 47 కిలోమీటర్లు రాక్షసత్వం | NHRC Notice on Greater Noida Minor Assault Case | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో నిర్భయ-2.. కదులుతున్న బస్సులో 47 కిలోమీటర్లు రాక్షసత్వం

Sep 1 2026 7:33 PM | Updated on Sep 1 2026 8:04 PM

NHRC Notice on Greater Noida Minor Assault Case

ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న మరో నిర్భయ తరహా దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్, బాధితురాలిపై దారుణం జరిగిన ప్రైవేట్ స్లీపర్ బస్సును ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు స్వయంగా పరిశీలించారు. 

ఈ ఘోరానికి సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్, గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్, మైన్‌పురి ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. విచారణ పురోగతి, బాధితురాలికి అందించిన పరిహారం వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోపు సమర్పించాలని ఆదేశించింది.

అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని (16) ఆగస్టు 4న తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడా సెక్టార్-63లోని బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పొరపాటున గ్రేటర్ నోయిడా పరిచౌక్ వద్ద బస్సు దిగింది. జోరు వానలో సెక్టార్-63 వైపు వెళ్లే వాహనం కోసం వేచి చూస్తుండగా, సుర్జాపూర్ నుంచి వస్తున్న 'విశ్వనాథ్' అనే ప్రైవేట్ స్లీపర్ బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)లు తాము సెక్టార్-63 వైపే వెళ్తున్నామని నమ్మబలికి ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నారు.

47 కిలోమీటర్లు నరకం
బాధితురాలు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన నిందితులు, బస్సు కర్టెన్లు మూసివేసి లైట్లు ఆర్పివేశారు. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి, కశ్మీరీ గేట్ వద్ద ఆమెను దింపివేసి పరారయ్యారు.

తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న బాధితురాలు ధైర్యం చేసి ఆటోలో సమీప పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బస్సులోని సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో, మార్గమధ్యలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ పోలీసులు పక్కా ఆధారాలతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు.

నాటి నిర్భయ ఘటనను గుర్తు చేసేలా  
ఈ ఘోరకలి 2012 నాటి ‘నిర్భయ’ దారుణాన్ని తలపించింది. ఢిల్లీ-నోయిడా ఎక్స్‌ప్రెస్ వే, రింగ్ రోడ్డు వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన నిఘా మార్గాల్లో బస్సు అంత దూరం ప్రయాణిస్తున్నా పెట్రోలింగ్ వాహనాలు గానీ, పోలీసులు గానీ గుర్తించకపోవడంపై మీడియా భద్రతా లోపాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల మహిళా భద్రతా దావాల డొల్లతనాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్, ఆప్ వంటి ప్రతిపక్షాలు మండిపడటంతో రాజకీయంగానూ పెద్ద దుమారమే రేగింది.

మరోవైపు, వివాదాలకు తావివ్వకుండా కశ్మీరీ గేట్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలికి ఢిల్లీ పోలీసులు తక్షణమే స్పందించి జీరో-ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించాయి.

ఆగస్టు 4న ఘటన జరగగా.. ఆగస్టు 31న జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్‌ 1న జాతీయ మానవ హక్కుల కమీషన్‌ చర్యలకు ఉపక్రమించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement