న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లు రద‍్దు కానున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన సీజేపీ నిరసనలపై దేశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2,873 నేరచరిత్ర కలిగిన వారి నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్‌ల నమోదుపై పోలీసులకు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలరని చెప్పింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలనే షరతుకి లోబడి ఆర్టికల్ 142 కింద ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నామని, ఈ విధానాన్ని రాష్ట్రాలు సైతం పాటించవచ్చని పేర్కొంది.
‘సెప్టెంబర్ 5 ర్యాలీ’ రద్దు
విద్యార్థులపై కేసుల ఉపసంహరణతో కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు.
మరోవైపు, అంతకుముందు ఎఫ్ఐఆర్‌ల రద్దుకు సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు ఢిల్లీ , బిహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర పోలీసులు. రెండు పక్షాలు పరస్పర నమ్మకంతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని సీజేఐ చెప్పారు. విద్యార్థులను ప్రత్యర్థులుగా భావించడం లేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు.


