కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం? | Minister Konda Surekha Press Meet Updates | Sakshi
Sakshi News home page

కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం?

Sep 3 2026 11:48 AM | Updated on Sep 3 2026 12:01 PM

Minister Konda Surekha Press Meet Updates

సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకపోతే మంత్రి పదవి నుంచి తప్పించే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ఏఐసీసీ కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో.. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై నిర్ణయం దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరనున్నారు. సీఎం హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత కొండా సురేఖ వ్యవహారంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరి కాసేపట్లో కొండా సురేఖ మీడియా ముందుకు రానుండటం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇస్తారా? లేక రాజీనామాపై ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె ఏం మాట్లాడతారు? అనే ఉత్కంఠ రేపుతోంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే!

ఈరోజు సాయంత్రంలోగా రాజీనామా ప్రకటన చేయకపోతే.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్‌కు సీఎం లేఖ రాసే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖ మంత్రి పదవిలో కొనసాగుతారా? లేదా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశాలతో తప్పుకుంటారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కీలకంగా మారిన ఈ పరిణామాలపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement