మాస్కో: రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఏర్పాటు చేసిన మానవరూప రోబో (హ్యూమనాయిడ్) ఒక వినియోగదారునిపై తిరగబడిన ఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ది టెర్మినేటర్’లోని సన్నివేశాలను తలపించేలా ఉన్న ఈ ఉదంతానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
‘ఎక్స్’ వేదికగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. నలుపు రంగు టీ-షర్టు ధరించిన ఒక వ్యక్తి దుకాణంలో ఉన్న రోబో వద్దకు వెళ్లి దానిని చేతులతో నెట్టాడు. ఆ మరుక్షణమే ఆ రోబో తన కాలును అతడి వైపునకు కదిలించి, తన్నేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. అక్కడున్నవారు ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆ యంత్రం తన కదలికలను కొనసాగించింది. పరిస్థితి అదుపుతప్పడంతో చివరకు దానిని స్విచ్ఛాఫ్ (పవర్ డౌన్) చేయాల్సి వచ్చిందని ఆ పోస్టులో పేర్కొన్నారు.
Robot consultant glitches and ATTACKS customer in Russia's Saratov
The customer escaped with a fright, while robot Syoma was sent for a reboot pic.twitter.com/tGYUhj4KPV— RT (@RT_com) September 2, 2026
ఈ పరిణామంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో యంత్రాలు మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటాయంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘మనిషి అహంకారం చివరకు రోబోలకు కూడా కోపం తెప్పించింది’ అని ఒకరు, ‘రోబోలకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది.. మితిమీరి కెలికితే ఇలాగే జరుగుతుంది’ అని మరొకరు రాసుకొచ్చారు. కాగా, ఈ దృశ్యాల విశ్వసనీయతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోబో స్వతంత్రంగానే స్పందించిందా లేక ఎవరైనా రిమోట్ కంట్రోల్ ద్వారా దానిని ఆపరేట్ చేశారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: మన చావును ఇలా తెలుసుకోవచ్చట.. షాకిస్తున్న జపాన్ అధ్యయనం!


