సరిహద్దుల్లో యుద్ధం మొదలైతే సైన్యం ముందుకు కదులుతుంది.. ఆయుధాలు రంగంలోకి దిగుతాయి. కానీ అదే సమయంలో దేశంలోని ఫ్యాక్టరీలు, టెక్నాలజీ కంపెనీలు, డేటా సెంటర్లు, రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు కూడా యుద్ధంలో భాగమైతే? చైనా ఇప్పుడు సరిగ్గా అదే దిశగా అడుగులు వేస్తోంది. తన జాతీయ రక్షణ సమీకరణ చట్టాన్ని సవరించడం ద్వారా అవసరమైనప్పుడు దేశంలోని ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక, మానవ వనరులను ఒకేసారి రక్షణ అవసరాలకు మళ్లించే వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. తాజాగా రక్షణ సమీకరణ చట్టంలో చేసిన భారీ మార్పులు.. భారత్‌కు రాబోయే యుద్ధాల అసలు స్వరూపంపై గట్టి హెచ్చరిక ఇస్తున్నాయి.
2010లో అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని తొలిసారిగా భారీగా సవరించిన జిన్‌పింగ్ ప్రభుత్వం.. ఆగస్టు 28న కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. 72 ఆర్టికల్స్‌ను 82కు పెంచిన ఈ సవరణలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. చైనా తాజా చట్టంలో అసలు కీలకమైన అంశం ఇదే. జాతీయ సార్వభౌమత్వం, భద్రత, ప్రాదేశిక సమగ్రతతో పాటు ఇప్పుడు ‘అభివృద్ధి ప్రయోజనాలు’ కూడా రక్షణ సమీకరణకు కారణంగా చేర్చింది. అంటే సరిహద్దుల్లో యుద్ధం మొదలైనప్పుడే దేశ వనరులను సమీకరించడం కాదు.. ఆర్థిక భద్రత, సాంకేతిక ప్రయోజనాలు, విదేశీ ఆస్తులు లేదా ఇతర వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పు వచ్చినా జాతీయ వనరులను రక్షణ అవసరాలకు ఉపయోగించే అవకాశం పెరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే.. చైనా యుద్ధాన్ని కేవలం సైన్యం చేసే పనిగా చూడటం లేదు. మొత్తం దేశ సామర్థ్యాన్ని యుద్ధానికి సిద్ధంగా ఉంచే వ్యవస్థను తయారు చేస్తోంది.
ఫ్యాక్టరీ నుంచి యుద్ధభూమి వరకు..
కొత్త చట్టం ప్రకారం అవసరమైనప్పుడు కంపెనీలను పరికరాలు, ముడి పదార్థాలు, సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ, డేటా నిల్వ చేసుకునేలా ఆదేశించవచ్చు. నిపుణులైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. సమీకరణకు ఆదేశాలు వచ్చినప్పుడు ఉత్పత్తిని పెంచాలి. అయితే, ఇక్కడే భారత్‌కు అసలు సవాలు మొదలవుతుంది. ఒకవేళ ఎల్‌ఏసీ వద్ద దీర్ఘకాలిక ఉద్రిక్తత ఏర్పడితే.. చైనా తన పరిశ్రమలను వేగంగా రక్షణ అవసరాలకు మళ్లించగలిగితే, సైన్యానికి అవసరమైన పరికరాలు, డ్రోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర సాంకేతిక సామగ్రి సరఫరాను వేగంగా పెంచే అవకాశం ఉంటుంది.
యుద్ధభూమిలో సైనికులు పోరాడుతుంటే.. వెనుక దేశంలోని పరిశ్రమలు ఆ సైన్యానికి నిరంతరం ‘ఇంధనం’ అందించేలా వ్యవస్థను సిద్ధం చేయడమే చైనా లక్ష్యం.
తుపాకులే కాదు.. డేటా యుద్ధం కూడా!
ఏఐ, సైబర్ ఆపరేషన్స్, డ్రోన్లు, రోబోటిక్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, డేటా వ్యవస్థలను కూడా చైనా రక్షణ సమీకరణలో భాగం చేసింది. దీంతో భవిష్యత్ ఘర్షణలో సరిహద్దుల్లో సైనిక ఒత్తిడితో పాటు సైబర్ దాడులు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం, సమాచార యుద్ధం, కీలక మౌలిక వసతులపై ఒత్తిడి వంటి చర్యలు ఏకకాలంలో ఎదురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు.. సరిహద్దులో సైనిక ఉద్రిక్తత కొనసాగుతూనే భారత్‌లోని కీలక డిజిటల్ నెట్‌వర్క్‌లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేదా సమాచార వాతావరణంపై ఒత్తిడి పెరిగితే.. అది సంప్రదాయ యుద్ధం కంటే చాలా విస్తృతమైన సవాలుగా మారుతుంది.
భారత్‌కు ప్రమాదం ఏంటి?
చైనా ఈ చట్టాన్ని సవరించిందంటే వెంటనే యుద్ధం వస్తుందన్న అర్థం కాదు. కానీ భవిష్యత్‌లో యుద్ధం లేదా సుదీర్ఘ సంక్షోభం వస్తే తన జాతీయ శక్తిని ఎంత వేగంగా సమీకరించుకోవాలనుకుంటోందో ఈ చట్టం స్పష్టం చేస్తోంది. భారత్-చైనా మధ్య 2020 లద్దాఖ్ ఉద్రిక్తతల తర్వాత ఎల్‌ఏసీపై ఇరు దేశాలూ మౌలిక వసతులు, సైనిక సామర్థ్యాలను పెంచుతున్నాయి. అలాంటి పరిస్థితిలో మరోసారి దీర్ఘకాలిక సరిహద్దు సంక్షోభం తలెత్తితే.. చైనా సైనిక బలంతో పాటు తన పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం ఉపయోగించగలగడం భారత్‌పై ఒత్తిడిని పెంచే అంశం.
పాక్‌తో టెన్షన్..
ఇక్కడ మరో కీలక అంశం చైనా-పాకిస్తాన్ సమీకరణం. ఒకవైపు ఉత్తర సరిహద్దులో చైనాతో ఉద్రిక్తత.. మరోవైపు పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్‌తో సమస్యలు తలెత్తితే భారత్ తన సైనిక వనరులను రెండు దిశల్లో పంచుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో యుద్ధాన్ని ప్రారంభించడం కంటే దాన్ని సుదీర్ఘకాలం కొనసాగించగల సామర్థ్యం అత్యంత కీలకంగా మారుతుంది. సైన్యానికి ఆయుధాలు ఉండటం మాత్రమే కాదు.. వాటిని నిరంతరం ఉత్పత్తి చేయగలగాలి. సైనికులకు సరఫరాలు చేరాలి. రోడ్లు, రైల్వేలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయాలి. ఉపగ్రహాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లు సురక్షితంగా ఉండాలి. సైబర్ దాడులను తట్టుకోవాలి. ఈ మొత్తం వ్యవస్థను ముందుగానే సిద్ధం చేసుకునే దిశగా చైనా అడుగులు వేస్తోంది.
భారత్ ఏం చేయాలి?
చైనా మోడల్‌ను భారత్ కాపీ చేయాల్సిన అవసరం లేదు. కానీ దాని వ్యూహం ఇచ్చే హెచ్చరికను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దేశీయ రక్షణ ఉత్పత్తిని మరింత పెంచడం, మందుగుండు సామగ్రి-ముఖ్యమైన పరికరాల వ్యూహాత్మక నిల్వలను బలోపేతం చేయడం, సరిహద్దు మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయడం, సైబర్ భద్రతను జాతీయ రక్షణలో భాగంగా చూడటం అవసరం. అదే సమయంలో ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థలు, కమ్యూనికేషన్ కంపెనీల సామర్థ్యాన్ని అవసరమైనప్పుడు దేశ రక్షణకు ఉపయోగించుకునే విధానాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్‌హౌస్!
చైనా కొత్త చట్టం వెనుక ఉన్న అసలు ఆలోచనను ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. యుద్ధం వచ్చినప్పుడు సైన్యాన్ని మాత్రమే సిద్ధం చేయడం కాదు.. యుద్ధం చేయగల దేశాన్నే ముందుగానే సిద్ధం చేయాలి. భవిష్యత్ యుద్ధం సరిహద్దుల్లో మాత్రమే జరగదు. అది ఆకాశంలో, సముద్రంలో, సైబర్ ప్రపంచంలో, ఆర్థిక వ్యవస్థలో, సమాచార రంగంలో, ఫ్యాక్టరీల్లోనూ సాగవచ్చు. అందుకే భారత్‌కు చైనా తాజా చట్టం తక్షణ యుద్ధ హెచ్చరిక కంటే దీర్ఘకాలిక వ్యూహాత్మక హెచ్చరిక. ఎవరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయన్నదే కాదు.. సంక్షోభం వచ్చినప్పుడు ఎవరు తమ మొత్తం దేశ శక్తిని వేగంగా సమీకరించగలరు? ఎవరు ఎక్కువకాలం సరఫరాను కొనసాగించగలరు? ఎవరి ఆర్థిక, సాంకేతిక, సైబర్ వ్యవస్థలు ఎక్కువకాలం నిలబడగలవు?. రాబోయే ఘర్షణల్లో విజేతను నిర్ణయించే ప్రశ్నలు ఇవే కావచ్చు.


