‘ఫ్లై91’లోకి బాలాకోట్ హీరో అభినందన్ | Abhinandan Varthaman Joins Regional Airline FLY91 After Retiring From Indian Air Force, Check More Details | Sakshi
Sakshi News home page

‘ఫ్లై91’లోకి బాలాకోట్ హీరో అభినందన్

Sep 3 2026 9:48 AM | Updated on Sep 3 2026 10:37 AM

IAF Hero Abhinandan Varthaman Joins FLY91 Airline

న్యూఢిల్లీ: నాటి భారత్-పాక్ వైమానిక ఘర్షణ(2019)లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత వైమానిక దళ (ఐఎఎఫ్‌)మాజీ గ్రూప్ కెప్టెన్, వీరచక్ర గ్రహీత అభినందన్ వర్ధమాన్ మరోమారు వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన భారత వైమానిక దళం నుంచి వైదొలిగి, గోవా కేంద్రంగా సేవలందిస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఫ్లై91’ (FLY91)లో పైలట్‌గా చేరారు.

పీటీఐ వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. ఆయన ఆగస్టులోనే ఈ సంస్థలో చేరినప్పటికీ, ఆయన బాధ్యతలు, ఇతర వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ వ్యవహారమని పేర్కొంటూ ఫ్లై91 ప్రతినిధి ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. ఫిబ్రవరి 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్‌పై భారత్ వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజు జరిగిన గగనతల పోరులో అభినందన్ వర్ధమాన్ ప్రముఖ పాత్ర పోషించారు.

అప్పట్లో వింగ్ కమాండర్‌గా ఉన్న 35 ఏళ్ల అభినందన్.. పాత తరం మిగ్-21 బైసన్ విమానంతో అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశారు. అనంతరం ఆయన నడుపుతున్న విమానం శత్రు క్షిపణి దాడికి గురికావడంతో పారాచూట్‌ ద్వారా పాకిస్థాన్ భూభాగంలోకి దిగాల్సి వచ్చింది. అక్కడ పాక్ సైన్యానికి చిక్కి సుమారు 60 గంటల పాటు బందీగా ఉన్నారు. అనంతరం అంతర్జాతీయ ఒత్తిళ్లు, చర్చల నేపథ్యంలో మార్చి 1, 2019న అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ ఆయనను భారత్‌కు అప్పగించింది.

విధి నిర్వహణలో ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలకు గాను 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనను మూడో అత్యున్నత పురస్కారమైన వీరచక్రతో సత్కరించింది. ప్రస్తుతం అభినందన్ చేరిన ‘ఫ్లై91’ ఎయిర్‌లైన్స్ 2024 మార్చిలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. గోవా, హైదరాబాద్ కేంద్రాలుగా ఆరు ఏటీఆర్ 72-600 (ATR 72-600) విమానాలతో చిన్న నగరాలను ప్రధాన నగరాలతో అనుసంధానిస్తూ ఈ సంస్థ సేవలందిస్తోంది.

ఇది కూడా చదవండి: మనిషిపై తిరగబడిన రోబో.. హడలెత్తిస్తున్న వీడియో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement