రాఘవ్‌ చద్దా సంచలన ఆరోపణలు | Raghav Chadha Raises Questions After His Name Goes Missing From Punjab Voter List, Alleges Political Vendetta | Sakshi
Sakshi News home page

సర్‌ ప్రక్రియపై రాఘవ్‌ చద్దా సంచలన ఆరోపణలు

Sep 3 2026 9:16 AM | Updated on Sep 3 2026 9:57 AM

Raghav Chadhas Name Deleted From Punjab Voter List Alleges Political Vendetta

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఉద్దేశపూర్వకంగా ఆయా ప్రభుత్వాలు ఓటర్లను తొలగిస్తున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా ఓటు గల్లంతు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై చద్దా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

సర్‌ ప్రక్రియలో తన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సాధారణ క్లరికల్‌ తప్పిదం కాదని చద్దా ఆరోపించారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత తనపై ఆ పార్టీ నాయకత్వం కక్ష పెంచుకుందని చద్దా ఆరోపించారు. ఆ రాజకీయ విభేదాలను ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎన్నికల జాబితా రూపకల్పనలో పనిచేసే అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ.. తన పేరును ‘షిఫ్టెడ్‌’గా గుర్తించడంపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. తన పేరును ఏదైనా కారణంతో ఫ్లాగ్‌ చేసినప్పటికీ, SIR మార్గదర్శకాల్లోని నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులకు కల్పించిన ప్రత్యేక రక్షణ కింద తన పేరును డ్రాఫ్ట్‌ జాబితాలో ఉంచాల్సి ఉందని వాదించారు. ఈ నిబంధనను తన విషయంలో ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని ఆరోపించారు.

రూల్స్‌ను కావాలనే..
SIR మార్గదర్శకాల్లోని పారా 4(d)ను కూడా రాఘవ్‌ చద్దా ప్రస్తావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల పేర్లు ఎన్నికల డేటాబేస్‌లో ఫ్లాగ్‌ అయినప్పటికీ.. క్లెయిమ్స్‌, అభ్యంతరాల సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించుకునేందుకు వారి పేర్లను డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో చేర్చాలని ఈ నిబంధన చెబుతోందని అన్నారు. తాను పంజాబ్‌ నుంచి సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యుడినని, అయినప్పటికీ తన పేరును డ్రాఫ్ట్‌ జాబితాలో ఉంచకుండా ‘షిఫ్టెడ్‌’గా పేర్కొనడం నిబంధనల ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనని ఆరోపించారు.

20.66 లక్షల పేర్లు తొలగింపు
పంజాబ్‌లో సర్‌ సందర్భంగా మొత్తం 20.66 లక్షల ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్‌ జాబితా నుంచి తొలగించారు. వీళ్లలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవాళ్లు, మరణించినవారు, డూప్లికేట్‌ నమోదులు ఉన్నవారు ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఇది దాదాపు 9.7 శాతం. చద్దా పేరు కూడా ‘ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డిజీస్డ్‌ అండ్‌ డూప్లికేట్‌’ (ASDD) జాబితాలో పర్మినెంట్లీ షిఫ్టెడ్‌గా నమోదైంది. 

ఆప్‌ కౌంటర్‌
అయితే చద్దా ఆరోపణలను అధికార ఆప్‌ తీవ్రంగా ఖండించింది. సర్‌ ప్రక్రియను ఎన్నికల సంఘమే నిర్వహిస్తోందని, ఇందులో పంజాబ్‌ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు చద్దా తన ఓటరు నమోదును ఢిల్లీకి మార్చుకునే ప్రయత్నం చేశారని ఆప్‌ ఆరోపించింది. దీంతో ఓటరు జాబితా వ్యవహారం ఇరు పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. 

తుది జాబితా ఇంకా రాలేదు: ఈసీ
ఇది ప్రస్తుతం డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా మాత్రమేనని ఎన్నికల సంఘం చెబుతోంది. పేరు తొలగింపుపై అభ్యంతరాలు, క్లెయిమ్స్‌ దాఖలు చేసుకునే అవకాశం చద్దాతో పాటు ఇతర ఓటర్లకు కూడా ఉంది. సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్‌లో తుది ఓటర్ల జాబితా వెలువడనుంది అని క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం ఇది డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా మాత్రమే. పేరు తొలగింపుపై క్లెయిమ్స్‌, అభ్యంతరాలు దాఖలు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. తన పేరు ‘షిఫ్టెడ్‌’గా ఎలా నమోదైందనే దానిపై రాఘవ్‌ చద్దా అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ వ్యవహారంపై వివరాలు సేకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఆప్‌ మాత్రం SIR ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది.

ఇదీ చదవండి: ఎవరు చెబితే అలా మాట్లాడుతున్నావ్‌?.. హీరోయిన్‌పై బీజేపీ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement