కపిల్ సిబల్ ఆరోపణ
మూకుమ్మడి తొలగింపులు అడ్డుకోవాలి
కోర్టులు పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు
న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకే భారత ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను నిర్వహిస్తోందని రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ బుధవారం ఆరోపించారు. సర్ కింద మూకుమ్మడిగా ఓటర్ల తొలగింపును సుప్రీంకోర్టు ఇప్పటికైనా అడ్డుకోవాలని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం సర్ పేరుతో చేస్తున్న ఓటర్ల జాబితా సవరణలు కూడా ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సాయపడేందుకేనని ఆయన విమర్శించారు.
జార్ఖండ్ రాష్ట్రంలో మైనార్టీ ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు బీజేపీ ఏజెంట్లు బ్లాక్ లెవల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన ఒక కథనంపై కపిల్ సిబల్ ‘ఎక్స్’పై స్పందించారు. ‘సర్’ ఓటర్ల జాబితాను మార్చేందుకు జరుగుతున్న కార్యక్రమం. బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకు చేస్తున్నారు. అని వ్యాఖ్యానించారు.
అనంతరం ఆయన న్యూఢిల్లీలో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ... జార్ఖండ్‌లో ఓటర్ల తొలగింపునకు సంబంధించిన ఫామ్–7లను అత్యధికంగా బీజేపీ కార్యకర్తలే దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఫామ్–7లను మూకుమ్మడిగా దాఖలు చేయవచ్చు. 45 లేదా వంద లేదా 400 ఫామ్స్ తీసుకుని ఏ ఏ పేర్లను తొలగించాలో చెప్పవచ్చు. అందుకే కారణాలేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పని తేలినా చేసేదేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ అంశంపై విచారణ జరిపినప్పుడు తొలగించమని కోరిన పేర్లలో అత్యధికం ముస్లింలకు చెందినవే ఉన్నాయని తెలిసిందన్నారు.
పరిస్థితులు ఇలా ఉంటే ఎన్నికలు నిర్వహించిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు తొలగించాలని దరఖాస్తులిచ్చిన ముస్లింలలో ఎక్కువ మంది ఆ ప్రాంతాంలోనే కుటుంబాలతో కలిసి ఏళ్లుగా ఉంటున్నట్లు తెలిసిందని చెప్పారు. ఇంతటి తీవ్రమైన అంశం కాబట్టే దేశ అత్యున్నత న్యాయస్థానం దీనిగ ఉరించి పట్టించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘సర్’ నిస్పాక్షికంగా జరుగుతున్నట్లు, ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉన్నట్లు న్యాయస్థానం భావిస్తే ప్రజాస్వామ్యం అతిపెద్ద సమస్యలో పడినట్లేనని స్పష్టం చేశారు.
కోట్ల పేర్లు తొలగించారు
‘‘ఉదాహరణకు ఢిల్లీలోనే 45 నుంచి 47 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారు. వీటిల్లో ఎన్ని పునరుద్ధరిస్తారో నాకు తెలియదు. కానీ ఢిల్లీలోని మొత్తం ఓట్లలో పేర్లు తొలగించిన వారు 23 – 24 శాతం మంది ఉన్నారు.’’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 2.05 కోట్ల పేర్లు తొలిగాయని, ఇదేరకంగా ఇతర ప్రాంతాల్లోనూ కోట్లకు కోట్ల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.
‘సర్’ మొదలైనప్పటి నుంచి దేశం మొత్తమ్మీద ఇప్పటివరకూ సుమారు ఐదారుకోట్ల పేర్లు తొలగించారని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం ప్రకారం ఇవన్నీ బీజేపీ కార్యకర్తలు మూకుమ్మడిగా ఫామ్–7లు దాఖలు చేయడం వల్ల తొలగినవేనని.. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే నిరూపితం కాగా... జాతీయ మీడియాలోనూ ఇప్పుడు కథనాలు వస్తున్నాయని వివరించారు. అదృష్టవశాత్తూ జార్ఖండ్‌లో బీఎల్‌ఓలు బీజేపీ కార్యకర్తల డిమాండ్లకు అభ్యంతరాలు చెబుతున్నారని, ప్రతిపక్షం అధికారంలో ఉండటం ఇందుకు కారణమైందని అన్నారు. అధికారంలోనూ బీజేపీనే ఉంటే ఎవరు అభ్యంతరం చెబుతారని ప్రశ్నించారు.


