మాకే అడ్డొస‍్తావా? అంటూ హెల్మెట్‌ పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే | Ex Karnataka MLA smashes mans helmet after he rides through BJP protest | Sakshi
Sakshi News home page

మాకే అడ్డొస‍్తావా? అంటూ హెల్మెట్‌ పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే

Sep 2 2026 5:55 PM | Updated on Sep 2 2026 6:19 PM

Ex Karnataka MLA smashes mans helmet after he rides through BJP protest

బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం బయట బీజేపీ నిర్వహించిన నిరసనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారుల మధ్యలో నుంచి స్కూటర్‌పై వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ టెల్కూర్ అడ్డుకున్నారు. అనంతరం అతడి హెల్మెట్‌ను నేలపై కొట్టారు. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని బీజేపీ కార్యకర్తలు కొట్టేంత పనిచేశారు. ఈ దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. 

నిరసన ప్రదేశంలో ద్విచక్ర వాహనాన్ని ఆపిన తర్వాత బీజేపీ కార్యకర్తలు దాని చుట్టూ గుమిగూడారు. నిరసన ప్రదేశం మధ్యలో నుంచి కాకుండా మరో మార్గంలో ఎందుకు వెళ్లలేదని నిరసనకారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. ఆ స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి భయపడిపోయాడు. టెల్కూర్ అక్కడికి వచ్చి జరిగిన వాగ్వాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తలు మోటార్‌సైకిల్ టైర్లలోని గాలిని కూడా తీసినట్లు సమాచారం. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

వాగ్వాదం కొనసాగుతున్న సమయంలో పలువురు నిరసనకారులు వాహనం చుట్టూ చేరారు. మరికొందరు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. చివరకు ఈ ఘటనలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ మధ్యలో స్కూటర్‌పై ఉన్న వ్యక్తిని నిరసన ప్రదేశం నుంచి దూరంగా తీసుకెళ్లారు. దీంతో అప్పటికప్పుడు నెలకొన్న ఉద్రిక్తత అదుపులోకి వచ్చింది.

కలబురగిలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం కోసం బీజేపీ ఈ నిరసన నిర్వహించింది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని 101 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిరసన జరిగింది. వీటిలో 89 తాలూకాలను తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా, 12 తాలూకాలను మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement