భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఉన్న సీఎం, ఎమ్మెల్యే ఫొటోలపై అయిల్ చల్లిన దృశ్యం
పరస్పరం కోడిగుడ్లు, రాళ్లతో దాడి
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల స్వల్ప లాఠీచార్జ్
సాక్షి యాదాద్రి: భువనగిరి జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం కార్యాలయాలపై దాడులకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ముందుగా బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం ఉదయం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్‌రెడ్డిల ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులపై పెట్రోల్, డీజిల్, ఆయిల్‌తో పాటు కాషాయ రంగును చల్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీజేవైఎం దాడికి నిరసనగా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు భువనగిరి పట్టణ పరిధిలోని నల్లగొండ బైపాస్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్–బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ రాళ్లదాడిలో ఇరువర్గాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

రాష్ట్ర బీజేపీకి అండగా ఉంటాం: నితిన్‌నబీన్
తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబీన్ ఆరా తీశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుకు ఫోన్ చేసిన నబీన్ ఈ రెండు రోజుల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీకి, నేతలకు జాతీయ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని రాంచందర్‌రావుకు నితిన్‌నబీన్ భరోసా ఇచ్చారు.
⇒ ‘ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? దాడులు చేసే వారిని కాపాడుతూ పరామర్శకు వెళ్లే వారిని అరెస్ట్ చేయడమేంటీ?’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
⇒ ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన..వెయ్యి మోసాల దగా కోరు పాలన. ఇది ప్రజా పాలన కాదు. చేతల్లో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన’అని బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ విమర్శించారు.
⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
డీజీపీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం
బీజేపీ కార్యాలయాలు, నాయకులపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది.
యూత్ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు
బీజేపీ ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన సంత్ శిరోమణి రవిదాస్ చిత్రపటాల పోస్టర్లపై నల్లరంగు పూసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెట్టాలని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఫిర్యాదు చేశారు.

ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టులు
సాక్షి, నెట్‌వర్క్: బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా మంగళవారం ట్యాంక్‌బండ్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్‌లను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును మంగళవారం పోలీసులు తార్నాకలోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిని పరామర్శించేందుకు వెళుతుండగా, రాంచందర్‌రావును అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ రాంచందర్‌రావును అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


