‘సర్‌’ కొనసాగుతుండగా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? | High Court on local body elections | Sakshi
Sakshi News home page

‘సర్‌’ కొనసాగుతుండగా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?

Sep 2 2026 5:56 AM | Updated on Sep 2 2026 5:56 AM

High Court on local body elections

ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ ఆందోళన అర్థవంతమైందే 

‘సర్‌’ ముగిసేవరకు వేచి చూడకుంటే.. ప్రయోజనం ఏముంది? 

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు 

వైఎస్సార్‌సీపీ వ్యాజ్యాన్ని సీజే ముందున్న వ్యాజ్యాలతో జత చేయండి

రిజిస్ట్రీకి న్యాయస్థానం ఆదేశం 

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కొనసాగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ప్రశ్నించింది. సర్‌లో గల్లంతైన ఓటర్లకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుందని, వారు తిరిగి ఓటుహక్కు పొందే ఆస్కారం ఉందని గుర్తు చేసింది. దీంతో తుది ఓటర్ల జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపింది. సర్‌ ప్రక్రియ ముగిసేవరకు వేచిచూడకుండా.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తే చాలామంది ఓటుహక్కు కోల్పోతారని పేర్కొంది. 

ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ వ్యక్తం చేస్తున్న ఆందోళన సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కూడా ఆ ధర్మాసనం ముందుంచడం సముచితమని న్యాయమూర్తి జస్టిస్‌ వడ్డిబోయిన సుజాత స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. 

సర్‌ ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత మంగళవారం విచారణ జరిపారు.

నోటిఫికేషన్‌ విడుదలైతే మా వ్యాజ్యం నిరర్థకం అవుతుంది 
వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలకు తాము దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి సంబంధమే లేదని తెలిపారు. ఆ వ్యాజ్యాల్లో పిటిషనర్లు ఏం కోరారు.. తాము ఈ వ్యాజ్యంలో ఏం కోరుతున్నాం అన్న వివరాలను ఆయన న్యాయమూర్తి ముందుంచారు. 

ఈ నెల 9న సీజే ధర్మాసనం ముందు ఈ వ్యాజ్యాలు విచారణకు రానున్నాయని, ఆలోపు ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైతే, తాము దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత అందులో న్యాయస్థానాల జోక్యంపై నిషేధం ఉందని తెలిపారు. ప్రస్తుతం సర్‌ ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికల రికార్టులన్నీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల సీజే ధర్మాసనానికి నివేదించిందని శ్రీరామ్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.  

ఆ వ్యాజ్యాలతో జత చేయండి 
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. సర్‌ ప్రక్రియ స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకి కాదన్నారు. పంచాయతీలకు సంబంధించి వార్డుల ఓటర్ల జాబితా ప్రచురణ ఈ ఏడాది ఏప్రిల్‌ 15న పూర్తయిందని, పట్టణ స్థానిక సంస్థల ఓటర్ల జాబితాను సెపె్టంబర్‌ 3న ప్రచురిస్తారని చెప్పారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలపై సీజే ధర్మాసనం విచారణ జరుపుతోందని, ఈ వ్యాజ్యాన్ని కూడా సీజే ధర్మాసనానికే పంపాలని కోరారు. 

ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ’సర్‌’ ప్రక్రియ ముగియకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది కనపర్తి అజయ్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ అభ్యర్థనను అనుమతిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయన్నారు. సర్‌ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికలను ఆపాలంటే మొత్తం ప్రక్రియను మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుందని, ఇందుకు ఐదారు నెలల సమయం పడుతుందని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం ముందున్న స్థానిక ఎన్నికల వ్యాజ్యాలతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.  

అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించమని చెప్పండి 
ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో లక్షల సంఖ్యలో ఓటు కోల్పోయిన వారున్నారని శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు. వీరిలో నిజంగా ఓటు కోల్పోయిన వారు సంబంధిత అధికారుల వద్ద అప్పీల్‌ దాఖలు చేసుకుని, తిరిగి ఓటు పొందే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 3 నాటికి సర్‌ ప్రక్రియ ముగియనుందని, ఆ తరువాత తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1ని అర్హత తేదీగా అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా సెప్టెంబర్ 3లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చిందని వివరించారు. 

సర్‌ ప్రక్రియను ముగించి అక్టోబర్‌ 3న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా ప్రచురించనుందని తెలిపారు. ఆ ఓటర్ల జాబితా ఆధారంగా మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ, నామినేషన్ల ముగింపు తేదీ నాటికి సర్‌ ప్రక్రియ వల్ల ఓటర్ల జాబితాలో జరిగే మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుని అనుబంధ ఓటర్ల జాబితాను విడుదల చేసేలా కూడా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement