మళ్లీ వినిపిస్తున్న అసంతృప్త స్వరాలు
అధినాయకత్వం ఆదేశించినా ముఖ్యనేతల తీరు అంతంతే
ఇటీవల ఓ ఎంపీ తీరుకు వ్యతిరేకంగా జగిత్యాలలో సమావేశం
పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
ఇంకా ఏర్పాటు కాని జిల్లా స్థాయి కోర్ కమిటీలు.. సర్దుబాటు కాని సమస్యలు
సాక్షి, హైదరాబాద్: కమలదళంలో అసంతృప్త గళాలు మళ్లీ వినిపిస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం ఆదేశించినా ముఖ్యనేతల తీరులో మార్పు అంతంతే అని పార్టీవర్గాలు పెదవి విరుస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో గ్రూపుల నివారణ, జిల్లా స్థాయిలో అసంతృప్తుల బుజ్జగింపులకు రాష్ట్ర ముఖ్యనేతలు నాయకత్వ స్థాయిలో పూర్తిస్థాయి చర్యలు చేపట్టకపోవడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య మెరుగైన కోఆర్డినేషన్ కోసం ఒకవైపు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో జాతీయ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతర్గత భేటీల్లో నేతల మధ్య విభేదాలు, సమన్వయలేమికి కారణాలు కనుక్కుని వాటిని పరిష్కరించే యత్నాలు జరిగాయి. అయితే మరోవైపు వివిధ జిల్లాల్లో అసంతృప్తుల భేటీలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎంపీ ఏకపక్ష తీరు, వివాదాస్పద వ్యవహారశైలికి వ్యతిరేకంగా జగిత్యాలలో సీనియర్ నేతల సమావేశం జరిగింది.
మొత్తంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై, స్థానిక ప్రజాప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) వ్యవహరిస్తున్న వైఖరిని ఈ భేటీలో పలువురు ఎండగట్టినట్టు తెలుస్తోంది. ఓ ఎంపీ నోటి దురుసు కారణంగా పార్టీ, నాయకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయినట్టు సమాచారం. ఉత్తర తెలంగాణలోని ఓ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సీటు పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల బాధిత నాయకులు పాల్గొని తమ సమస్యలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పార్టీలోని కొందరు ముఖ్యనేతలు వ్యవహారశైలిని వారు తప్పుబట్టడంతోపాటు, గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఫండ్ దురి్వనియోగం, గెలిచే స్థానాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పక్షపాతంతో వ్యవహరించడం తదితరాలను ప్రస్తావించినట్టు తెలిసింది. ఏదో ఒక జిల్లాలో ఏదో ఒకరూపంలో పార్టీలో నాయకుల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతుండడంతో మెరుగైన సమన్వయం అనేది అందని ద్రాక్షగానే మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పలు జిల్లాల్లో సమన్వయలేమి ?
పలు జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నేతలు, గతంలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకుల మధ్య సరిగ్గా పొసగడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని జిల్లాల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించే వారికి సీనియర్లు సహకారం అందించకుండా సహాయ నిరాకరణకు దిగుతున్నట్టు తెలిసింది. గతంలో తాము పార్టీలో కీలకంగా వ్యహరించినా, ఇప్పుడు మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. కనీసం జిల్లా స్థాయిలో తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని, తమ అనుభవాన్ని ఉపయోగించుకునే ప్రయత్నమే చేయకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోవాల్సి వస్తోందని వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారట. అన్ని జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తయినా ఇంకా జిల్లా స్థాయిలో కోర్ కమిటీలు ఏర్పడకపోవడం పట్ల కూడా వివిధ స్థాయిల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ నేతల మధ్య సర్దుబాటు కాని సమస్యలను సమన్వయ కమిటీల ద్వారా పరిష్కరించే అవకాశమున్నా అది జరగడం లేదంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు...కొందరు సీనియర్ నేతలు తమ నివాసాల్లో అసంతృప్తుల సమావేశాలు నిర్వహించారు. అప్పుడు పార్టీ ప్రతిష్ట దిగజారకుండా, నేతల మధ్య సమన్వయసాధన, భిన్నాభిప్రాయాలున్న వారికి సర్దిచెప్పేందుకు, ఇలాంటి భేటీల నివారణకు సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి (ప్రస్తుత త్రిపుర గవర్నర్)ఆధ్వర్యంలో కమిటీని వేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యనేతల అసంతృప్త నేతల వ్యవహారం ముదిరిపాకాన పడకుండా ఆయన సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా అదేవిధమైన చొరవ, చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.


